హామీలను నెరవేర్చడంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు…!
- వచ్చే నెల నుంచి రూ.31 వేల కోట్లతో రుణమాఫీ అమలు
- నేలకొండపల్లి మండల పర్యటనలో మంత్రి పొంగులేటి
సికె న్యూస్ ప్రతినిధి
నేలకొండపల్లి : పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఇందిరమ్మ ప్రభుత్వం వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని, ఎన్నికల సమయంలో ఏ హామీలను ఇచ్చామో వాటన్నింటిని విడతల వారిగా నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.
నేలకొండపల్లి మండల పర్యటనలో భాగంగా మోటాపురం, శంకరగిరి తండా, రాజేశ్వరపురం, అమ్మగూడెం, కోరట్లగూడెం, కోనాయిగూడెం, అరెగూడెం, ఆచార్లగూడెం, బోదులబండ, మండ్రాజుపల్లి తదితర గ్రామాలను నందర్శించారు. ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ కోసం అన్ని సమకూరుస్తున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో వచ్చేనెల జూలై నుంచి రుణమాఫీ అమలవుతుందని తెలిపారు. రూ.31 వేల కోట్లతో రైతుల రుణమాఫీ జరుగుతుందని వెల్లడించారు.
ప్రభుత్వం చేయబోయే రుణమాఫీని తట్టుకోలేక ప్రతిపక్షం వాళ్లు నోరుజారి ఏవేవో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు పేదవాళ్లలో అతిపేదవాళ్లకు ముందు మంజూరు చేస్తామన్నారు. లిఫ్ట్ లు రిపేరు చేయించి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
రాజేశ్వరపురం గ్రామంలో నేలకొండపల్లి మండల కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.