పాలనను పరుగులు పెట్టించాలి
విధులకు వన్నే తెచ్చేలా మెలగాలి
ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దే బాధ్యత ఉద్యోగులదే
శాఖల పనితీరుపై పక్షం రోజులకో రివ్యూ
ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది
సమీక్షా సమావేశంలో అధికారులకు సీతక్క దిశానిర్దేశం
ఘన స్వాగతం పలికిన కలెక్టర్, ప్రజా ప్రతినిధులు
మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి , మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క మహబూబాబాద్ జిల్లా అభివృద్ధిపై శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ ఆవరణలో సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలతో మాట్లాడి దరఖాస్తులను స్వీకరించారు.
కలెక్టరేట్ లో మంత్రికి కలెక్టర్ ఆధ్వైత్ కుమార్ సింగ్, ప్రభుత్వ విప్ రామ చంద్రనాయక్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు డాక్టర్ మురళీ నాయక్, కోరం కనకయ్య, ఎమ్మెల్సీ తక్కెల్లపల్లి రవీందర్ రావు ఘన స్వాగతం పలికారు. సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క అధికారులకు దిశా నిర్దేశం చేసారు. ఎన్నికల కోడ్ ముగిసినందున పాలనను పరుగులు పెట్టించాలని సూచించారు. రాజకీయ పరమైన కారణాలతో ఈ దఫా మూడు నెలల పాటు ఎన్నికల కోడ్ ఉన్నందున చాలా సమస్యలు పెండింగ్ లో ఉండిపోయాయని గుర్తు చేసారు. అందుకే ప్రభుత్వం, అధికారులు పరుగులు పెట్టి పనిచేస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావన్నారు. అధికారులంతా మొదట పెండింగ్ సమస్యల పరిష్కారానికే ప్రధాన్యతనివ్వాలని కోరారు. ప్రణాళిక బద్దంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పథకాల అమలు, శాఖల పనితీరుపై ప్రతి పదిహేను రోజులకోసారి సమీక్ష నిర్వహించాలని కలెక్టర్ ఆధ్వైత్ కుమార్ సింగ్ కు సూచించారు. శాఖల వారిగా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలన్నారు. ప్రజల ప్రశంసలు పొందేలా ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తించాలన్నారు సీతక్క. విధులకు వన్నే తెచ్చేలా మెలిగినప్పుడే ఉద్యోగులకు ఆత్మ సంత్రుప్తి మిగులుతుందన్నారు.
కార్యాలయాలకే పరిమితం కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులు క్షేత్ర స్ధాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలని కోరారు. మహబూబాబాద్ జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దే బాధ్యత ఉద్యోగులపైనే ఉంటుందన్న సీతక్క…రాజకీయాలు, పార్టీలకు అతీతంగా సమస్యల పరిష్కారమే గీటురాయిగా పనిచేయాలని సూచించారు. ఉద్యోగులుగా కాకుండా ప్రజా సేవకులుగా పనిచేస్తేనే ప్రజలు హర్షిస్తారని తెలిపారు. ప్రజలు చెల్లించే పన్నులతోనే జీతాలు అందుతున్నందున.. వారి అభివృద్ది లక్ష్యంగానే ఉద్యోగులు పనిచేయాలన్నారు. అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందని తెలిపారు సీతక్క. మంత్రి సమీక్షా సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ మోహన్ రావు, డీఎఫ్ఓ, అధికారులు, అన్ని శాఖల హోఓడీలు హజరయ్యారు.