కాంగ్రెస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు… ప్రధాని పై కేసు నమోదు
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓ ప్రైవేటు కేసు నమోదైంది.
సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ‘కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లింలకు సంపద పంచుతుంది’ అని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సంపద పంపిణీలో ముస్లింలకు కాంగ్రెస్ అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ ఇలా వ్యాఖ్యలు చేశారంటూ బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానంలో జియావుర్ రెహమాన్ ప్రైవేట్ ఫిర్యాదు చేశారు.
రాజస్థాన్లో ఎన్నికల ప్రసంగంలో మోడీ రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని, కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే దేశ సంపదను ముస్లింలకు మాత్రమే కేటాయించాలని యోచిస్తోందని రెహమాన్ ఆరోపించారు. ఈ కేసుపై ఇవాళ (జూన్ 26) విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తీర్పును రిజర్వు చేసింది.
కేసు నేపథ్యం ఇదీ… 2024 లోక్సభ ఎన్నికలకు ముందు జరిగిన ప్రచార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ”కాంగ్రెస్ పార్టీ దేశ బడ్జెట్ను మతపరమైన మార్గాల్లో పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, ముస్లిం సమాజానికి ప్రత్యేకంగా 15శాతం కేటాయించాలని చూస్తోంది” అని వ్యాఖ్యానించారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఉన్న రిజర్వేషన్లను ముస్లింలకు మళ్లించాలని కాంగ్రెస్ యోచిస్తోందని, ఈ చర్యను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని ఆరోపించారు.
సామాన్య ప్రజల కోసం తీసుకొచ్చిన రిజర్వేషన్లు, సంపదను దొంగిలించడాన్ని మేం అనుమతించబోమని మోదీ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం కులం లేదా మతం ఆధారంగా ప్రయోజనాలను పంపిణీ చేయదని ఉద్ఘాటించారు.
అయితే, మోడీ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై న్యాయ పోరాటం జరుగుతుందా లేదా అన్నది కోర్టు నిర్ణయాన్ని బట్టి తెలుస్తుంది.