మద్యం తాగి పాఠశాలకు వస్తూ విద్యార్థులను దుర్భాషలాడుతున్నారంటూ ఓ ఉపాధ్యాయుణ్ని విద్యార్థుల తల్లిదండ్రులు నిర్బంధించారు.
ఈ ఘటన గురువారం పట్టణంలోని ఇల్లెందులపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది.
విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన ప్రకారం.. పాఠశాలలో మొత్తం 11మంది విద్యార్థులున్నారు. కాల్వ సుధాకర్ హెచ్ఎం, ఉపాధ్యాయుడిగా వ్యవహరిస్తున్నారు.
గురువారం తన స్నేహితునితో కలిసి పాఠశాలలోని ఓ గదిలో మద్యం తాగుతున్నారు. అటుగా వెళ్లిన విద్యార్థులను నానా బూతులు తిట్టారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. వారిని గమనించిన ఉపాధ్యాయుని స్నేహితుడు వెనకనుంచి పారిపోయాడు.
గదిలో ఉన్న ఉపాధ్యాయుణ్ని తల్లిదండ్రులు బంధించి తాళం వేశారు. గంటపాటు అందులోనే ఉంచి, ఎంఈఓ రావాలని పట్టుబట్టారు. కాంప్లెక్స్ హెచ్ఎం యాదమ్మ, పోలీసు సిబ్బంది అక్కడికి రావటంతో తాళం తీశారు. విషయాన్ని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని కాంప్లెక్సు హెచ్ఎం తెలిపారు.