ఆ రుణాలు మాత్రం మాఫీ కావు… సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో రుణమాఫీపై మరో నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 2 లక్షల వరకే రుణమాఫీ చేస్తామన్నారు. దీనికి రేషన్‌కార్డు ప్రామాణికం కాదని..అది కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని రేవంత్ రెడ్డి క్లియర్ కట్‌గా చెప్పేశారు.బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు మాఫీ కావన్నారు.
పాస్ బుక్ ఆధారంగానే రుణ మాఫీ ఉంటుందని వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ పెట్టిన రెండ్రోజుల తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై దృష్టి పెడతామని సీఎం రేవంత్ చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు పథకం కోసం ఆర్టీసీకి ప్రతి నెలా 350 కోట్ల రూపాయలకుపైగా ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు.
పీసీసీ పదవిపై కాంగ్రెస్ హై కమాండ్ తీవ్ర కసరత్తు
ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటారు. ఇప్పుడు తెలంగాణలో మాత్రం దారులన్నీ ఢిల్లీకే దారి తీశాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీసీసీ చీఫ్ ప్రకటనతో పాటు కేబినెట్ విస్తరణపై నిర్ణయం కూడా ఉండటంతో ఎవరి అంచనాల్లో వారున్నారు. మరీ ముఖ్యంగా పీసీపీ పగ్గాలు ఎవరి చేతికి అప్పగించాలన్న అంశంపైనే హై కమాండ్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నది.
సామాజిక సమీకరణ పాటించాలా? పాటిస్తే ఏ వర్గానికి అవకాశం ఇవ్వాలి? మిగిలిన వర్గాల మాటేమిటి? సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటామన్న కాంగ్రెస్ ఈ సారి మార్పులు చేర్పుల్లో ఏ మేరకు మాట నిలుపుకుంటుందనేది మరి కొన్ని కాసేపట్లో తేలిపోనున్నది.
పీసీసీ చీఫ్ నియామకంలో బీసీలకే ప్రాధాన్యం కల్పించాలన్న చర్చ ప్రధానంగా జరుగుతున్నది. రెడ్డి సామాజిక వర్గానికి సీఎం పదవి ఉన్న నేపథ్యంలో పార్టీ పదవి బీసీలకు ఇవ్వాలనేది మెజార్టీ కాంగ్రెస్ నేతల అభిప్రాయంగా ఉన్నది. హై కమాండ్ కూడా ఈ దిశగానే ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది.
బీసీ వర్గానికి పీసీసీ పోస్ట్ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇవ్వవచ్చు అని చర్చ కూడా జోరుగా సాగుతున్నది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేష్ గౌడ్ పేరు అందరి కన్నా ముందు వరుసలో ఉన్నది. ఆయన తర్వాత మధుయాష్కి గౌడ్ పేరు కూడా బలంగా వినిపిస్తున్నది.
పీసీసీ పగ్గాలు బీసీకి ఇస్తే.. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల్లో సామాజిక సమతుల్యత పాటించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న వారికి తిరిగి అదే పదవులు ఇచ్చే అవకాశాలు కనిపించటం లేదు. జగ్గారెడ్డి లాంటి నేతలు తిరిగి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కంటిన్యూ చేయటానికి ఆసక్తి చూపడం లేదు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రచార కమిటీ చైర్మన్ పదవులను పార్టీ కల్పిస్తూ వుంటుంది.
కానీ తెలంగాణలో మూడేళ్ల క్రితం ప్రచార కమిటీ చైర్మన్‌ని నియమించింది. ఇప్పుడు మరోసారి ఆ పదవిని భర్తీ చేస్తారనే చర్చ జరుగుతున్నది. ఒక వేళ అదే నిజమైతే ఈ పోస్టుకు జగ్గారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. కానీ జగ్గారెడ్డి మాత్రం ఢిల్లీలో కాకుండా హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. పార్టీ నాయకులంతా ఢిల్లీలో ఉంటే జగ్గారెడ్డి మాత్రం హైదరాబాద్‌కే పరిమితం కావటంతో అనుమానాలు మొదలయ్యాయి.
ఒక వేళ సామాజిక సమీకరణాల్లో భాగంగా పీసీసీ పోస్టు బీసీలకు కాకుండా ఎస్సీలకు కేటాయించాల్సి వస్తే అందుకు ఎవరు అర్హులు అన్న అంశంపై కూడా అధిష్ఠానం కసరత్తు చేసింది. పార్టీని ఒక్క తాటిపై నడిపించగల సామర్థ్యం ఎవరికి ఉంది? అని విచారించింది. ఎస్సీ కేటగిరీలో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పేరు ప్రముఖంగా వినిపించిందని పార్టీ వర్గాలు తెలిపాయి.
అతను కాకుండా మరి ఇంకెవరి పేర్లయినా వినిపించాయన్నది ప్రస్తుతానికి బయటకు రాలేదు. అలాగే పీసీసీ పగ్గాలు ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇవ్వాలి? అనే దానిపై కూడా పార్టీ హై కమాండ్ సమాలోచనలు జరిపినట్టు సమాచారం. ఈ కేటగిరీలో బలరాం నాయక్ పేరుతో పాటు మంత్రి సీతక్క పేరు కూడా వినిపించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తీవ్ర కసరత్తు తర్వాత పీసీసీ అధ్యక్షుడి సంగతి ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది. ఇక మిగిలింది కేబినెట్లో మార్పులు చేర్పుల అంశం. దీనిపైన కూడా హై కమాండ్ గట్టిగా దృష్టి పెట్టింది. ఆరుగురు కొత్త వారికి మంత్రి పదవులు ఇచ్చే వెసలుబాటు ఉన్నా నాలుగు లేదంటే ఐదుగురికి మాత్రమే మంత్రి పదవులు కట్టబెట్టే అవకాశం కనిపిస్తున్నది. ఇందులో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం కల్పించాలన్న డిమాండ్‌ను అధిష్ఠానం పరిగణనలోకి తీసుకున్నది. ఇప్పటికే మంత్రివర్గంలో రెడ్ల ప్రాతినిథ్యం ఎక్కువగా ఉందని చర్చ మొదలైంది.
ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ సామాజిక వర్గంలో మాలలకే పెద్ద పీట వేశారన్న అసంతృప్తి కూడా పార్టీలో నెలకొన్నది. కేబినెట్‌లో ఆదిలాబాద్ జిల్లాకు ప్రాతినిథ్యం కల్పించాల్సిన అవసరమున్నది. ఈ జిల్లా నుంచి బెర్త్ కోసం ఇటీవలే పార్టీలోకి వచ్చిన ఓ కుటుంబం పోటీ పడుతున్నది. దీంతో మాలల కన్నా మాదిగలకే ప్రాధాన్యమివ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.
ఆదిలాబాద్ జిల్లా నుంచి వెలమ సామాజిక వర్గం నేతలు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య పంచాయితీ కంటే మూడో వ్యక్తికి పదవి ఇస్తే ఎలా ఉంటుందన్న కోణంలో కూడా హై కమాండ్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఇక గిరిజనులకు ప్రాతినిథ్యం కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ కొంత చిన్నచూపు చూస్తున్నదన్న భావన ఆ వర్గంలో ఉన్నది. నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఉన్న ఇద్దరు మంత్రులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే.
మళ్లీ అదే వర్గానికి అవకాశమిస్తే రాజగోపాల్‌రెడ్దికి మంత్రి పదవి దక్కవచ్చన్న చర్చ కూడా నడుస్తున్నది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు రాజగోపాల్‌రెడ్డికి హై కమాండ్ మంత్రి పదవి హామీ ఇచ్చినట్టు కూడా చర్చలో వినిపిస్తున్నది. ఇదే జరిగితే నల్లగొండ నుంచి ముగ్గురు మంత్రులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారవుతారు.
ఇది మిగతా సామాజిక వర్గాల్లో అసంతృప్తికి కారణమవుతుందని పార్టీ ఆలోచిస్తున్నది. దేవర కొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి తన మనసులో మాట వినిపించినట్టు సమాచారం. గిరిజన కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని బాలునాయక్ సీఎంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు.
కేబినెట్ విస్తరణంలో బీసీలకు కూడా చోటు కల్పించాలన్న డిమాండ్ కూడా బలంగానే వినిపిస్తున్నది. దీని పరిగణనలోకి తీసుకుంటే మంత్రివర్గంలోకి వచ్చే బీసీ నేత ఎవరు అన్న దానిపై కూడా చర్చ జరిగింది. పీసీసీ చీఫ్‌ని బీసీ సామాజిక వర్గానికి ఇస్తే క్యాబినేట్లో బీసీల సంఖ్యను పెంచకపోవచ్చు.
నిజామాబాద్ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కే అవకాశముంది. ఒక వేళ నిజామాబాద్ జిల్లా కోటాలో పీసీసీ చీఫ్ పదవి మహేష్ గౌడ్‌కు ఇస్తే సామాజిక సమీకరణం కుదిరినట్టే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలా కాకుండా మాదిగలకు ప్రాతినిథ్యం కల్పించాలని భావిస్తే ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు అన్న చర్చ కూడా జరుగుతున్నది.
మరో కీలకమైన విషయమేమిటంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వరాదని కాంగ్రెస్ పార్టీలో నిబంధన పెట్టుకున్నట్టు తెలుస్తున్నది.
దీనికితోడు పీసీసీ చీఫ్ నియామకంలో కూడా పార్టీ అనుబంధ సంఘాల నుంచి వచ్చిన వారికి అవకాశం ఇవ్వాలన్న ప్రస్తావన కూడా వచ్చినట్టు సమాచారం. ఒక వేళ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఎవరైనా పీసీసీ కోసం పట్టుబడితే ఏదో ఒక పదవి మాత్రమే ఇవ్వాలని హై కమాండ్ దృష్టికి తెచ్చినట్టు తెలిసింది.
2021, జూన్ 27న పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. అప్పటి నుంచి మూడేళ్ల పాటు తనకు హై కమాండ్ ఇచ్చిన బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తించానని రేవంత్ ఇదివరకే స్పష్టంగా చెప్పారు.
అలాగే కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని పార్టీ అధిష్ఠానానికి గతంలోనే ఆయన విజ్ఞప్తి కూడా చేసినట్టు సమాచారం. పీసీసీ చీఫ్‌గా ఎవరిని నియమించాలన్నది అధిష్ఠానం చేతిలో ఉందని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
తాను ఎవరి పేరును సూచించలేదని కూడా చెప్పారు. శుక్రవారం రాత్రి కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరో ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి తన రాకను ఒక రోజు వాయిదా వేసుకున్నారు.
మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకులంతా హస్తినలోనే ఉండిపోయారు. పీసీసీ పదవితో పాటు మంత్రివర్గ విస్తరణలో ఎవరి పావులు వారు కదుపుతున్నారు. ఏ మేరకు సామాజిక సమీకరణాలను పాటించి పార్టీలో అసంతృప్తికి తావు లేకుండా కాంగ్రెస్ తీసుకోబోయే నిర్ణయం కోసం ఇప్పుడందరూ ఎదరు చూస్తున్నారు.