అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతా
- జిల్లా మంత్రుల సహకారంతో సమస్యలు పరిష్కరిస్తా
- జిల్లాకు యునివర్సిటీ కోసం కృషి చేస్తా
- కొత్తగూడెం విమానాశ్రయం,సింగరేణి, స్పాంజ్ ఐరన్, ఇతర పరిశ్రమలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తా
- ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి
- ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి కాంగ్రెస్ కార్యాలయానికి రాగా..
శ్రేణుల ఘన సత్కారం
ఖమ్మం: తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యలు పరిష్కరించి, తన అవకాశం మేరకు అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతానని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి అన్నారు.
పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేశాక, తొలి సమావేశాల అనంతరం మొదటిసారి జిల్లాకు విచ్చేసిన ఆయన తొలుత నగరంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయానికి వెళ్లారు.
అక్కడ పార్టీ జిల్లా అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సాదర స్వాగతం పలికి, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి భట్టి , మంత్రులు తుమ్మల, పొంగులేటి సారధ్యంలో పనిచేస్తానని అన్నారు.
భారీ మెజారిటీ అందించిన ప్రజలకు పాదాభివందనం
తనకు అఖండ మెజారిటీ అందించిన ఉభయ జిల్లాల ప్రజలకు శిరస్సు వంచి వారికి పాదాభివందనం చేస్తున్నానని చెబుతూ.. కృతజ్ఞతలు తెలిపారు. అత్యధికంగా ఖమ్మం నియోజకవర్గం లో 86వేల మెజారిటీ వచ్చిందని, ప్రతి నియోజకవర్గంలో కూడా 60 వేల మెజారిటీ అందించి ప్రజలు తనకు గురుతర బాధ్యతను అప్పగించారని ఆనందం వ్యక్తం చేశారు.
వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని అభయమిచ్చారు. పాలేరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుదాం రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి గతంలో పాలేరులో పలు అభివృద్ధి పనులు చేశారని.. ఆమె సహకారంతో పర్యాటక కేంద్రంగా మలిచేందుకు కృషి చేస్తానని ఎంపీ రఘురాం రెడ్డి అన్నారు.
ఈ విషయంపై తాజాగా చర్చించామని, ఇతర పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని అన్నారు. జిల్లాకు యూనివర్సిటీ.. కొత్తగూడెంలో విమానాశ్రయంపై..
ఖమ్మం జిల్లాకు ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ అన్నారు.
అలాగే కొత్తగూడెంలో విమానాశ్రయం ప్రాజెక్టు అనేక ఏళ్లుగా పెండింగ్లో ఉందని.. ఈ అంశంపై ఇటీవల మంత్రి పొంగులేటి కదలిక తెచ్చారని, అది పూర్తి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. స్పాంజ్ ఐరన్, మిగతా మూతపడిన పరిశ్రమలు తెరిపించేందుకు చర్చిస్తానన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, కీలక అంశాలపై సంబంధిత కేంద్ర మంత్రులను కలిసి పూర్తి చేయించేందుకు కృషి చేస్తానని ఎంపీ అన్నారు.
రాహుల్ గాంధీ నేతృత్వంలో ముందుకు..
తాము కేంద్ర ప్రభుత్వానికి శత్రువులం కాదని, దేశాభివృద్ధికి కచ్చితంగా సహకరిస్తామని తమ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రకటించారని ఎంపీ రఘురాంరెడ్డి గుర్తు చేశారు.
విపక్షంగా తమను దూరం పెట్టొద్దని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు సమాన అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రజల పక్షాన ముందుకు సాగుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో.. మాజీ ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, ఐ ఎన్ టి యు సి నేత కొత్తా సీతారాములు, నాయకులు ఐలూరి వెంకటేశ్వర రెడ్డి, బాలగంగాధర్ తిలక్, వడ్డెబోయిన నరసింహారావు, హుస్సేన్, మలీదు వెంకటేశ్వర్లు, బొందయ్య తదితరులు పాల్గొన్నారు.