తహసీల్దారును నిర్బంధించిన విఆర్వో
web desc :
సహ వీఆర్వోను చెప్పుతో కొట్టబోయిన వైనం
ఘంటసాల: కృష్ణాజిల్లా ఘంటసాల తహసీల్దారును మంగళవారం వీఆర్వో నాగమల్లేశ్వరి నిర్బంధించారు. తోటి వీఆర్వోను చెప్పుతో కొట్టబోయారు. తనకు న్యాయం చేయకపోతే కొడుకుతో సహా చనిపోతానంటూ ధర్నాకు దిగారు.
ఈ వ్యవహారం సంచలనం కలిగించింది. ఘంటసాల మండలం ఘంటసాలపాలెం సచివాలయ వీఆర్వోగా బి.నాగమల్లేశ్వరి పనిచేస్తున్నారు. సచివాలయం పరిధిలోని ఘంటసాలపాలెం, కొత్తపల్లి, తాడేపల్లి గ్రామాల వీఆర్వోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆ మూడు గ్రామాలకు సంబంధించిన పాస్‌బుక్ ఫైల్స్, ప్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, ఇతర రెవెన్యూ పనులను అధికారులు తన ప్రమేయం లేకుండానే కొడాలి, ఘంటసాల, లంకపల్లి వీఆర్వోలు తదితరులతో చేయిస్తున్నారని, తన సంతకాలు లేకుండా ఫైల్స్ ఆన్‌లైన్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కొడాలి వీఆర్వోను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించారు.
కార్యాలయంలో తహసీల్దారు ఎన్.బి.విజయలక్ష్మి ని నిర్బంధించారు. తనకు న్యాయం చేసేంతవరకు తలుపులు తీయనని భీషి్మంచారు. బయట నుంచి సిబ్బంది కేకలు వేయడంతో ఆమె తలుపులు తీశారు.
ఆమె కుమారుడు కార్యాలయం బయట గోడలపై పెట్రోల్ పోశాడు. కలెక్టర్, జేసీ, ఆర్డీవో వచ్చి తనకు న్యాయం చేయాలని, లేదా తన కుమారుడితో కలసి చనిపోతానంటూ కుమారుడితో కలసి తహసీల్దార్ చాంబర్ ముందు ధర్నాకు దిగారు.
తన పరిధిలో పనులు తన ప్రమేయం లేకుండా జరగడంపై ఆర్డీవో విచారించాలని, తనకు న్యాయం చేయాలని తొమ్మిది నెలలుగా ఆర్డీవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు.
ఈ విషయమై తహసీల్దార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చల్లపల్లి సీఐ సీహెచ్.నాగప్రసాద్, ఎస్‌ఐ చినబాబు అక్కడికి వచ్చి వీఆర్వో నాగమల్లేశ్వరితో మాట్లాడారు.
ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూద్దామని సర్దిచెప్పారు. అయినా నాగమల్లేశ్వరి ఆందోళన విరమించకపోవడంతో కలెక్టర్‌తో మాట్లాడిస్తామని సంబంధిత అధికారులతో చెప్పించి ధర్నా విరమింపజేశారు.
ఈ విషయమై తహసీల్దార్ విజయలక్ష్మి మాట్లాడుతూ తాను ఎన్నికల విధుల్లో భాగంగా ఐదునెలలు కిందట ఘంటసాల వచ్చినట్లు చెప్పారు. తాను పనుల్ని ప్రాపర్ చానల్ ద్వారానే చేస్తున్నానని, ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదని తెలిపారు.
తన గదిలోకి వచ్చిన వీఆర్వో నాగమల్లేశ్వరి అక్కడే ఉన్న కొడాలి వీఆర్వోను చెప్పుతో కొట్టబోయిందని, ఏమైందని అడుగుతుండగానే అసభ్య పదజాలంతో తిట్టడమేగాక తలుపులు మూసేసిందని, అనంతరం తన చాంబర్ ముందు బైఠాయించిందని చెప్పారు.
గత తహసీల్దార్ హయాంలో వీఆర్వోకు సంబంధం లేకుండా ఫైల్స్ చేశారని వీఆర్వో ఆరోపిస్తున్నట్లు తెలిపారు. ఆర్డీవో నుంచి వీఆర్వోపై వచ్చిన రిపోర్టు చూసి ఆగ్రహంతో ఆందోళన చేసి ఉంటుందని భావిస్తున్నట్లు తహసీల్దార్ పేర్కొన్నారు.