గంజాయి మత్తులో చిన్నారిపై హత్యాచారం!
తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో బుధవారం ఘటన
బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి బాలికను తీసుకెళ్లినట్టు అంగీకరించిన నిందితుడు
తరువాత ఏం జరిగిందో గుర్తులేదని వెల్లడి
అంతకుముందు రోజునే బాలిక తండ్రితో నిందితుడి గొడవ
ప్రతీకారంతో ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసుల అనుమానం, దర్యాప్తు ప్రారంభం
గంజాయి మత్తులో ఓ యువకుడు ముక్కుపచ్చలారని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది. బీహార్‌కు చెందిన కొన్ని కుటుంబాలు మండలంలోని ఓ గ్రామ రైస్ మిల్లులో పని చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాయి. అందులో ఓ భార్యాభర్తలు కూడా పనిచేస్తున్నారు.
ఆ దంపతుల రెండో కుమార్తె (8)ను అదే మిల్లులో పనిచేస్తున్న బీహారీ యువకుడు దిలీప్ (20) బిస్కెట్లు ఇస్తానని చెప్పి ఉదయం తీసుకెళ్లాడు. మధ్యాహ్నం మిల్లు నుంచి వచ్చిన తల్లిదండ్రులకు చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల అంతా వెతికారు.
ఈ క్రమంలో పాప మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతంలో మేకల కాపర్లు గుర్తించి స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐలు జగన్మోహన్ రావు, శ్రీనివాసులు రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
బాలిక నోటితోపాటు పలు శరీర భాగాల్లో గాయాలను గమనించారు. నిందితుడు అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఉండొచ్చనే అనుమానంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
దిలీప్ బాలికను తీసుకెళుతున్న దృశ్యాలను సీసీటీవీ కెమెరా ఫుటేజీ ద్వారా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికకు బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లానని, ఆ తరువాత ఏం జరిగిందో తనకు గుర్తు లేదని అన్నాడు.
దీంతో, అతడు గంజాయి మత్తులో ఘోరానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావించారు. అయితే, మంగళవారం రాత్రి దిలీప్ గంజాయి మత్తులో బాలిక తండ్రితో గొడవ పడ్డాడు. ఆ మరుసటి రోజే ఇలా జరగడంతో కావాలనే చేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.