ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం
- మద్దులపల్లిలో శాశ్వత భవనం ఏర్పాటుకు మంత్రి పొంగులేటి కృషి
- కాంటూర్ సర్వే పూర్తి చేసిన జెఎన్టీయూ అధికారులు
- త్వరలోనే శంకుస్థాపనకు ఏర్పాట్లు
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం రూరల్ : మంత్రి పొంగులేటి చొరవతో పాలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి రెవెన్యూ పరిధిలో కళాశాలకు కేటాయించిన ముప్ఫై ఎకరాల్లో శాశ్వత భవనం నిర్మాణం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
గత ప్రభుత్వం ఎన్నికల స్టంట్ లో భాగంగా జెఎన్టీయూ కళాశాల ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించినప్పటికీ దాని నిర్మాణంపై శ్రద్ధ పెట్టలేదు. ప్రస్తుతం కళాశాలను అద్దె భవనంలోనే కొనసాగిస్తున్నారు.
ఈ నేపధ్యంలో పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే, తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని కళాశాలకు శాశ్వత భవనం ఉండేలా కృషి చేస్తున్నారు.
తాజాగా రెండు రోజుల క్రితం జెఎన్టీయూ అధికారులు కాంటూర్ సర్వేను పూర్తి చేశారు. భవన నిర్మాణానికి కావాల్సిన అన్ని ప్రణాళికలను రూపొందించారు.
జెఎన్టీయూహెచ్ డైరెక్టర్లు, ప్రొఫెసర్లు డాక్టర్ వి.వెంకటేశ్వర రెడ్డి, డాక్టర్ బి. రవీంద్ర రెడ్డి, డాక్టర్ డి.రమేష్ ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ సర్వేయర్ సతీష్ రెడ్డి పర్యవేక్షణలో ఈ సర్వే నిర్వహించారు. త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు జెఎన్టీయూహెచ్ ఉన్నతాధికారులు తెలిపారు.