గన్ మిస్ ఫైర్.. సీఐఎస్ఎఫ్ జవాన్ మృతి
సంగారెడ్డి జిల్లాలోని బీడీఎల్ పరిశ్రమలో దారుణం జరిగింది. అనుకోకుండా గన్ పేలి ఓ సీఐఎస్ఎఫ్ జవాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్యూటీలో ఉన్న సమయంలో బెటాలియన్ బస్సులో ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడం, తూటా జవాన్ తలలోకి దూసుకెళ్లడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
బీడీఎల్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి సీఐఎస్ఎఫ్ (CISF) కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు (34) మృతి చెందాడు. బీడీఎల్ బానూర్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా అరుకు మండలం జునుతల గ్రామానికి చెందిన వెంకటేశ్ పటాన్ చెరు మండలం బీడీఎల్లో సీఐఎస్ఎఫ్ జవాన్గా చేస్తున్నాడు.
ఏడాదిన్నర కిందట ఇక్కడికి బదిలీపై వచ్చాడు వెంకటేశ్. జులై 19న రాత్రి వెంకటేశ్వర్లు డ్యూటీ కోసం బీడీఎల్ కు వెళ్లాడు. WATCH tower No. 4 వద్ద డ్యూటీ చేశాడు.
శనివారం తెల్లవారుజామున డ్యూటీ ముగించుకుని సీఐఎప్ఎఫ్ యూనిట్ లైన్ బ్యారేక్ లో బస్ దిగే క్రమములో చేతిలో ఉన్న తుపాకీ ప్రమాదవశాత్తూ పేలింది. వెంటనే బుల్లెట్ వెంకటేశ్వర్లు గొంతు నుంచి తలలోకి దూసుకెళ్లడంతో జవాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
సీఐఎస్ఎఫ్ జవాన్ వెంకటేశ్కు భార్య లక్ష్మీదేవి, తొమ్మిదేళ్ల కొడుకు సాయి, ఎనిమిదేళ్ల కూతురు సాయి పల్లవి ఉన్నారు. 13 ఏళ్ల నుంచి వెంకటేశ్ సేవలు అందిస్తున్నాడు. కానీ ప్రమాదవశాత్తూ గన్ పేలి చనిపోవడంతో విషాదం నెలకొంది. బీడీఎల్ భానూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.