యువత పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి…
Hyderabad : అధికారంలోకి వచ్చి ఏడాది తిరక్కముందే దాదాపు 60 వేల ఉద్యోగాల నియామకాలు జరపడం ద్వారా యువత పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకుంటున్నామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చెప్పారు.
🔷 ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలను అందించామని, ఆ తర్వాత డీఎస్సీ, గ్రూప్ 1, 2, 3, లాంటి వివిధ శాఖల్లో ఖాళీలైన మరో 30 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎం గుర్తుచేశారు.
🔷 చట్టబద్దమైన జాబ్ క్యాలెండర్ ద్వారా ఏటా నిర్దిష్టమైన గడువులోపు ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగ యువకుల్లో విశ్వాసం కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ముఖ్యమంత్రి వివరించారు.
🔷 తెలంగాణ ఫైర్ సర్వీసెస్ – సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ను ముఖ్యమంత్రి సమీక్షించి వారి గౌరవ వందనం స్వీకరించారు.
🔷 అనంతరం ప్రసంగించిన ముఖ్యమంత్రి, గతంలో 30 వేలు మంది నియామక పత్రాలు అందుకున్న వారిలో 483 ఫైర్మెన్లు, 155 డ్రైవర్ ఆపరేటర్స్‌కు కూడా ఉండటం, వారిప్పుడు కఠిన శిక్షణ కూడా పూర్తి చేసుకోవడంపట్ల ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు.
🔷 ఏ ప్రమాదాలు జరిగినా ప్రాణాలకు తెగించి సామాజిక బాధ్యతగా ఉద్యోగంలో చేరడానికి ముందు కొచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని అభినందిస్తుందని చెప్పారు.
🔷 ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపించాలన్నదే తమ ఆలోచనగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సహేతుకమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఎవరూ నిరసనలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదన్నారు.
🔷 ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శ్రీ పట్నం మహేందర్ రెడ్డి, శ్రీ ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యే శ్రీ ప్రకాశ్ గౌడ్, హోంశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.