నాల్గవ రోజు అసెంబ్లీ సమావేశాలు.. నేడు బడ్జెట్ పద్దు పై చర్చ..
Telangana Assembly 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాల్గవ రోజు ప్రారంభంకానున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఒక్కరోజు విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఇవాళ తిరిగి సమావేశం కానుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ సభలో జరిగే చర్చలో పాల్గొనేందుకు సభ్యులు బడ్జెట్ ను అధ్యయనం చేసి శుక్రవారం సెలవు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. అయితే ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి నేరుగా బడ్జెట్ పై చర్చకు అవకాశం కల్పించారు. దీంతో ఉభయ సభల్లో ఉదయం 10 గంటల నుంచి బడ్జెట్‌పై సాధారణ చర్చ ప్రారంభం కానుంది.
ఆ తర్వాత శాసనసభలో ముందుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పనున్నారు. అనంతరం శాసనమండలిలో కూడా సమాధానం చెబుతారు. బడ్జెట్ పై చర్చలో సభ్యులు లేవనెత్తిన అంశాలకు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నాయి.
డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నిన్న (ఈ నెల 26న) అసెంబ్లీకి సెలవు ప్రకటించగా.. ఇవాళ (27న) బడ్జెట్‌పై చర్చ జరగనుంది. రేపు జూలై 28 ఆదివారం కావడంతో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం జూలై 29, 30 తేదీల్లో పలు బిల్లులు ప్రవేశపెట్టనుంది.
జూలై 31న ద్రవ్యవినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు.ఆగస్టు 1,2 తేదీల్లో వివిధ బిల్లులను ప్రవేశపెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కంటే కాస్త ఎక్కువగానే 2 లక్షల 91 వేల 159 కోట్ల రూపాయలతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పద్దును ప్రవేశపెట్టారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, హామీల అమలుకు రూ. 2 లక్షల 91 వేల 159 కోట్లతో రాష్ట్ర పూర్తి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి శాసనసభకు సమర్పించారు.
ఇందులో ఆదాయం రూ. 2 లక్షల 21 వేల 242 కోట్లు మరియు మూలధన రాబడి రూ. 69 వేల 572 గా అంచనా వేశారు. పన్నుల ద్వారా రాబడి రూ. లక్షా 38 వేల 181 కోట్లు, పన్నుయేతర ఆదాయం రూ. 35 వేల 208 కోట్లు వస్తాయని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ. 26 వేల 216 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్ల ద్వారా 21 వేల 636 కోట్లు వస్తాయని ప్రతిపాదించారు. బహిరంగ మార్కెట్‌లో రుణాల ద్వారా రూ. 57 వేల 112 కోట్లు, కేంద్రం రుణాల ద్వారా రూ. 3 వేల 900 కోట్లు, ఇతర రుణాల ద్వారా 1000 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు.