వైద్యుడి నిర్లక్ష్యంతో గర్భిణి మృతి
వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వచ్చిన గర్భిణి వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా మృతి చెందింది.వివరాలు ఇలా ఉన్నాయి.
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్ద దగడ గ్రామానికి చెందిన సరిత (పుష్పావతి) (22) అనే గర్భిణికి శనివారం రాత్రి వాంతులు, కడుపు నొప్పి రావడంతో పెబ్బేరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకవచ్చారు.
ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులు వైద్యుడికి సమాచారం ఇచ్చారు. ఆయన సెల్‌ఫోన్ మెసేజ్ ద్వారా ఫలానా ఇంజక్షన్లు వేయాలని నర్సులకు సూచించడంతో వారు గర్భిణికి వేశారు.
దీనితో నర్సులు చేసిన వైద్యం వికటించి ఆదివారం తెల్లవారు జామున మృతి చెందగా, పరిస్థితి విషమించిందని డ్యూటి డాక్టర్‌కు నర్సులు చెప్పగా అప్పుడు ఆయన ఆస్పత్రికి వచ్చి ఆమెను పరిశీలించి పరిస్థితి విషమించిందని కర్నూలుకు వెళ్లాలని సూచించారు.
కర్నూలుకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని అక్కడి వైద్యులు తెలిపారని బంధువులు తెలిపారు. మృతురాలు శ్రీరంగాపురం మండలం నాగసానిపల్లి గ్రామానికి చెందిన మహిళ కాగా ఆమెను చిన్నంబావి మండలం పెద్ద దగడ గ్రామానికి చెందిన ఎల్లస్వామి అనే వ్యక్తికి గత ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగినట్లు బంధువులు తెలిపారు.
కాగా ఆమె ప్రస్తుతం నాలుగు నెలల గర్బిణిగా ఉందని, అందులో భాగంగానే చికిత్స కోసం రాగా ఇలా జరిగిందని మృతురాలి బంధువులు బోరున విలపించారు.
మృతురాలి తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి ఆమెను పెంచి పెళ్లి చేసిందని బంధువులు గుర్తు చేశారు. వైద్యం వికటించి గర్భిణి మరణించిన విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెబ్బేరుకు చేరుకొని ఆసుపత్రి యజమాన్యంపై చర్యలు తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
శవాన్ని కర్నూలు నుంచి తీసుకొచ్చి ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తారని తెలుసుకున్న కొత్తకోట సీఐ రాంబాబు, ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డిలు ఆసుపత్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆదివారం రాత్రి వరకు మృతురాలి పరిహారం ఇప్పించేందుకు గ్రామస్థులు, నాయకులు ప్రయత్నాలు చేశారు. పోలీస్ స్టేషన్ సమీపంలో ఆసుపత్రి యజమాన్యంతో గ్రామస్థులు చర్చలు జరిపారు.