సీఎం రేవంత్ ను కలిసిన ఎమ్మెల్యేలు… ఆ పదవి తమకే ఇవ్వాలని డిమాండ్
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, అపోసిషన్ బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్దం నడుస్తోంది.
నువ్వా నేనా.. అన్నట్లు అసెంబ్లీలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ఎత్తిచూపిస్తుంది.
మరోవైపు బీఆర్ఎస్ కూడా ఏమాత్రం తగ్గేదెలా అన్నట్లు.. తాము చేసిన ప్రతి దాన్ని తప్పుగా చిత్రీకరించడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని కూడా బీఆర్ఎస్ నేతలు అంతే ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో టీ బ్రేక్ లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
తెలంగాణకు చెందిన మాదిగ ఎమ్మెల్యేలు.. అడ్లూరి లక్ష్మణ్, కవంపల్లి సత్యనారాయణ, మందుల సామ్యేల్, లక్ష్మీ కాంతారావు, వేముల వీరేశంలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. ఈసారి మంత్రి వర్గ విస్తరణలో మాదిగలకు తప్పనిసరిగా మంత్రి పదవి ఇవ్వాలని కూడా వినతి పత్రంలో కోరినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గమైన మాదిగ కమ్యునిటీకి అవకాశం ఇవ్వాలని కూడా మాదిగ వర్గానికి చెందిన నేతలు కోరినట్లు సమాచారం. మరోవైపు.. 3 ఎంపీ సీట్లలో ఇతర వర్గానికి కేటాయించారు.
అదే విధంగా తెలంగాణ డిప్యూటీ సీఎం పదవి, స్పీకర్ పదవిని మాల వర్గానికి కేటాయించారు. ఈ నేపథ్యంలో తమకు కాంగ్రెస్ సర్కారు అన్యాయం చేసిందని కొన్ని రోజులుగా మాదిగ కమ్యునిటీ నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతో ప్రస్తుతం మాదిగలకు మంత్రి పదవి ఇస్తే ఆ కమ్యునిటీ నుంచి వస్తున్నవ్యతిరేకతను దూరం చేసుకోవచ్చని కొంత మంది రాజకీయ పండితులు చెప్తున్నారు. ఇదిలా ఉండగా.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తమకు అన్యాయం జరిగిందని అనేక పర్యాయాలు మాదిగలు తమ గొడును చెప్పుకున్నారు.
కేంద్రం తమకు కేటాయించిన ఫండ్స్, సబ్ ప్లాన్ నిధులను మాజీ సీఎం కేసీఆర్ ఇతర వాటికి ఉపయోగించాడని మాదిగ వర్గపు నేతలు విమర్శించారు.
అంతేకాకుండా.. అసైండ్ భూముల్ని కూడా లాక్కుని, తమపైన కేసులు పెట్టారని కూడా అనేక మార్లు మీడియా ఎదుట తమ బాధల్ని చెప్పుకున్నారు. ఈసారైన కాంగ్రెస్ సర్కారు తమకు న్యాయం చేయాలని మాదిర వర్గానికి చెందిన నేతలు సీఎం రేవంత్ ను కలిసినట్లు తెలుస్తోంది.