దళిత బంధు పథకం దారి మళ్లీతే సహించేది లేదు…
వారం లోపల దారి మళ్లిన వాటిని తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలి…
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…
సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం : దళిత బంధు పథకం దారి మళ్లీతే సహించేది లేదని, వారం లోపల దారి మళ్లిన వాటిని తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
శనివారం చింతకాని రైతు వేదికలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి, చింతకాని మండల దళిత బంధు పథక గ్రామ ప్రత్యేక అధికారులతో దళిత బంధు పథక అమలుపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చింతకాని మండలంలో అర్హులైన లబ్దిదారులందరికి దళిత బంధు పథక లబ్ది మంజూరు అయినట్లు తెలిపారు. దళిత బంధు దుర్వినియోగంలో లబ్ధిదారునికి ఎంత పాత్ర ఉంటుందో, ప్రత్యేక అధికారులకు అంతే పాత్ర ఉంటుందన్నారు.
మొదటి దశ విజయవంతంగా పూర్తి చేసిన దళిత బంధు లబ్ధిదారులకు వారంలోగా రెండవ దశ నిధులు విడుదల చేస్తామని ఆయన అన్నారు. దళిత బంధు పథకంలో చింతకాని మండలం శాచ్యురేషన్ పద్ధతిలో ఎంపికైందని, అన్ని గ్రామాలను ప్రత్యేక అధికారులు సందర్శన చేసి దళిత బంధు పథకం కింద లబ్ధి పొందిన వారిని గుర్తించి వివరాలు సేకరించాలన్నారు.
దళిత బంధు కింద మంజూరైన యూనిట్లు లబ్ధిదారుల వద్ద ఉన్నాయా? లేదా? అవి దారి మళ్లాయా విచారణ చేయాలన్నారు. ఇతరులకు అమ్మారా, బదిలీ చేశారా గుర్తించి, వాటన్నిటిని వారంలోగా తిరిగి లబ్ధిదారులకు ప్రత్యేక అధికారులు అందించాలన్నారు.
దళిత బందు పథకం కింద మంజూరైన యూనిట్లను అమ్మడం కానీ, బదిలీ చేయడం నేరమని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. లబ్ధిదారులు స్మాల్ స్కేల్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైతే ఇండస్ట్రియల్ పార్కును మంజూరు చేస్తామని ఆయన అన్నారు.
డెయిరీ, మేకలు, గొర్రెలు యూనిట్లకు ఇన్సూరెన్స్ చేయించింది, చనిపోయిన వాటికి ఇన్సూరెన్స్ ఇప్పించారా అని అధికారులను ప్రశ్నించారు. ఇన్సూరెన్స్ చేయించడం, ఇప్పించడం అధికారుల బాధ్యతని ఆయన అన్నారు. డెయిరీ యూనిట్లలో గేదెలు ఏమయ్యాయి? లబ్ధిదారులు వాటిని ఎక్కడ అమ్ముకున్నారు? విచారించాలన్నారు.
జేసీబీలు, ట్రాలీలను ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ ఇంజనీరింగ్ పనులలో ఉపయోగించాలన్నారు. అవసరం అయితే అధికారులు జేసీబీ యజమానులకు, కాంట్రాక్టర్లకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించి వాటిని ప్రభుత్వ పనుల్లో ఉపయోగించేలా చర్యలు చేపెట్టాలన్నారు.
దళితబంధు పథకం వందకువంద శాతం విజయవంతం కావాలని, దళిత బంధు పథకం లో లబ్ధి పొందిన వారు ఎలా ఉపయోగించుకుంటున్నారు అనే సమాచారాన్ని నిరంతరం ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.
దళిత బందులో పథకం లబ్ధిదారులు తమ పథకాన్ని మరొకరికి అమ్ముకోవడంగాని, వెరొక్కరికి ధారాదత్తం చేయడానికి వీల్లేదని అన్నారు. దళిత బంధు పథకం లబ్దిదారులు ఆ పథకం ఎలా నిర్వహిస్తున్నారు
చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని, నూటికి నూరు పాళ్ళు దళిత బంధు లబ్దిదారులు వ్యాపారం చేయాల్సిందేనని, వారి వద్దనే వ్యాపారానికి కేటాయించిన యూనిట్లు ఉండాలని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
సమీక్ష లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, జిల్లాలో చింతకాని మండలాన్ని దళిత బంధు పథకానికి సాచురేషన్ మోడ్ లో ఎంపిక కాగా, 3462 మంది లబ్దిదారులని గుర్తించినట్లు తెలిపారు.
1888 మంది లబ్దిదారులకు వంద శాతం దళిత బంధు లబ్ది చేకూర్చగా, మిగిలిన 1574 మందికి మొదటి దఫా యూనిట్లు మంజూరు చేసి, గ్రౌండింగ్ చేశామన్నారు. మొదటి దఫా యూనిట్ల మొత్తం పోనూ, రూ. 28 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో, రూ. 2 కోట్లు గేదెలు, గొర్రెల యూనిట్ల కొనుగోలుకు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఖాతాలో నిల్వ ఉన్నాయన్నారు.
వారం రోజుల్లో గ్రామ ప్రత్యేక అధికారులు, గ్రామాల సందర్శన చేసి, మంజూరు యూనిట్ల స్థితిగతులు ఆరా తీస్తారని, దళిత బంధు పథకం పక్కదారి పట్టించిన చోట, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.
విజయవంతంగా నడుస్తున్న యూనిట్లకు సంబంధించి, లబ్దిదారులకు రెండో దఫాలో ఏ తరహా యూనిట్లు మంజూరు చేయాలి, వారి ఆర్థికాభివృద్ధికి ఎలా చేస్తే బాగుంటుందనే దారిపై సమగ్రంగా పరిశీలన చేసి, నివేదిక సమర్పిస్తారని కలెక్టర్ అన్నారు.
సమీక్ష లో గ్రామ ప్రత్యేక అధికారులు, ఆయా గ్రామాల్లో మంజూరు యూనిట్లు, వాటి స్థితిగతులను వివరించారు. ఉప ముఖ్యమంత్రి రైతు వేదిక ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, ఎస్సి కార్పొరేషన్ ఇడి ఏలూరి శ్రీనివాసరావు, రాష్ట్ర హస్త కళల అభివృద్ధి సహకార ఛైర్మన్ నాయుడు సత్యనారాయణ, చింతకాని మండల ఎంపిపి కె. పూర్ణయ్య, జెడ్పిటిసి పి. తిరుపతి కిషోర్, గ్రామ ప్రత్యేక అధికారులు/వివిధ శాఖల జిల్లా అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.