రెవెన్యూ ఉద్యోగి ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు
నిజామాబాద్ మున్సిపల్ ఆఫీసులో అవినీతి బాగోతం బయటపడింది. రెవెన్యూ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ నివాసంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి.
నరేందర్ ఇంట్లో.. ఏకంగా 2 కోట్ల 93 లక్షల 81 వేల రూపాయల డబ్బు బయటపడింది. ఇంట్లో ఉన్న నోట్ల కట్టలు చూసి షాక్ అయిన ఏసీబీ అధికారులు…
వాటిని లెక్కించేందుకు ప్రత్యేకంగా నోట్ల లెక్కింపు యంత్రాల్ని తీసుకొచ్చారు. అలాగే నరేందర్, అతని భార్య, అతని తల్లి బ్యాంక్ ఖాతాలో.. అక్షరాల కోటి 10 లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు.
బీరువాల్లో అర కిలో బంగారం, స్థిరాస్తులకు సంబంధించి 17 డాక్యుమెంట్లు బయటపడ్డాయి. మొత్తం ఆస్తుల విలువ రూ.6 కోట్ల 7 లక్షల ఉంటుందని… బహిరంగ మార్కెట్లో విటి విలువ భారీగా ఉంటుందని అంచనా వేశారు.
నరేందర్ ఇంటితోపాటు ఆఫీసు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేశారు. అదనపు ఆస్తులను వెలికితీసేందుకు సోదాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆదాయం మించిన ఆస్తుల కేసులో నరేందర్‌పై కేసు నమోదు చేశారు.
అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతుంది. నరేందర్‌ను హైదరాబాద్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపర్చనున్నారు. నరేందర్‌పై గత కొంత కాలంగా అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.
అంత మొత్తం సొమ్ము సంపాదించాలంటే.. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడటం తప్ప మరో మార్గం ద్వారా సాధ్యం కాదని గుర్తించి ఏసీబీ అధికారులు గుట్టు రట్టు చేశారు.
ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ లంచం డిమాండ్ చేస్తే, చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ACB, TG, హైదరాబాద్ టోల్ ఫ్రీ నంబర్-1064ను సంప్రదించాలని ప్రజలకు ఏసీబీ అధికారులు సూచించారు.