25 మంది గురుకుల విద్యార్థినులకు అస్వస్థత
గురుకులాల్లో జరుగుతున్న వరుస ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. గత ఏడు నెలల్లో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో 36 మంది విద్యార్థులు ప్రాణాలు విడిచారని అధికారులు తెలిపారు. దాదాపు 500 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు.
దీంతో రాష్ట్రంలోని గురుకులాలపై ప్రభుత్వానికి కనీస బాధ్యత లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రభుత్వానికి మాత్రం చిన్న చీమ కుట్టునట్లు కూడా లేదని ఆరోపిస్తున్నారు.
అయినప్పటికీ ప్రభుత్వం ఈ అంశంపై స్పందించక పోగా.. ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు హాస్పిటల్ పాలవుతున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయి.
తాజగా, ఒకే గురుకుల పాఠశాలకు చెందిన 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో మరోసారి గురుకులాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం తెరపైకి వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా ముహమ్మదాబాద్ మండలం నంచర్ల గురుకుల పాఠశాలలో ఉదయం టిఫిన్ తిన్న కొద్దిసేపటికే 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని సిబ్బంది తెలిపారు. వెంటనే డాక్టర్లను పిలిపించి చికిత్స అందించారు.
కాగా, ఉడకని కిచిడి పెట్టడంతో పిల్లలు అస్వస్థతకు గురయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. త్రాగునీరు సరిగ్గా లేకపోవడం వల్ల అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.