ఖమ్మం జిల్లాలో విషాదం…
అప్పుల భారంతో రైతు ఆత్మహత్య
అప్పుల భారంతో ఓ ఆదర్శ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాపటపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఇనపాల మాధవరావు (55) తన ఎకరన్నర భూమిలో జామ, కూరగాయలు, వేరుసెనగ వంటివి ప్రయోగాత్మకంగా సాగుచేసి అధిక దిగుబడులు సాధిస్తూ ఆదర్శ రైతుగా గుర్తింపు పొందారు.
పొలంలో డెయిరీఫాం ఏర్పాటుకు రూ.3 లక్షలు అప్పు చేశారు. గతంలో తీసుకున్న పంటరుణం, బయటి బ్యాంకుల్లో భూమి తనఖా పెట్టి తీసుకున్న అప్పు కలిసి రూ.10 లక్షలు అయింది.
ఆయనకు తల్లి, భార్య, ఇద్దరు కుమారులున్నారు. తల్లి, భార్య అనారోగ్యంతో బాధపడుతుండటం, అప్పుల భారం పెరిగిపోవడంతో మనస్తాపం చెందారు. వేరే గ్రామంలో ఉన్న చిన్న కోడలికి ఫోన్‌చేసి పిల్లలను చూడాలని ఉందని బుధవారం పిలిపించుకున్నారు.
వారిని చూసిన అనంతరం రాత్రి గడ్డిమందు తాగారు. అర్ధరాత్రి దాటిన తరువాత గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం సర్వజనాసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు.