అప్పు పుట్టడంలేదని కౌలు రైతు బలవన్మరణం
వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం అప్పు పుట్టడంలేదనే మనస్తాపంతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై మంగళవారం జూలూరుపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
వారి కథనం ప్రకారం..ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఏరుగట్ల గ్రామం నుంచి వగ్గెల ప్రసాద్(36) కుటుంబం పదేళ్ల క్రితం బతుకుతెరువు కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం శంభునిగూడెం గ్రామానికి వచ్చింది.
ప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఏడాది ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు. పెట్టుబడి కోసం అప్పు చేయడానికి ప్రయత్నించగా ఎక్కడా దొరకలేదు.
దీంతో మనస్తాపానికి గురైన ప్రసాద్ తరచూ భార్య వద్ద చనిపోవాలని ఉందంటూ చెప్పేవారు. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి 12.30 గంటలకు తన కౌలు పొలంలో ప్రసాద్ పడిపోయి ఉండటాన్ని గుర్తించిన గ్రామస్థులు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు.
అతడి పక్కనే పురుగుమందు డబ్బా ఉందని తెలిపారు. ప్రసాద్‌ను కొత్తగూడెం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.