తెలంగాణలో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
భద్రాద్రి జిల్లా అటవీ ప్రాంతంలో గురువారం మరోసారి కాల్పుల మోత మోగింది. కరకగూడెం మండలం రఘునాథపాలెం వద్ద పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు గ్రేహౌండ్స్ పోలీసులకు గాయాలయ్యాయి.
అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అడవిలో జల్లెడ పట్టిన పోలీసులకు మావోయిస్టులు ఎదురయ్యారు. ఈ క్రమంలోనే రెండు వైపుల నుంచి భీకరంగా కాల్పులు జరిగాయి.
అయితే, కాల్పుల్లో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన ఓ మావోయిస్టు అగ్ర నేత పాల్వంచ – మణుగూరు- కరకగూడెం డీవీసీఎం లచ్చన్న హతమైనట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.
మృతులంతా లచ్చన్న దళానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా గాయపడిన ఇద్దరు పోలీసులను చికిత్స నిమిత్తం మణుగూరుకు తరలించారు.