కేటీఆర్ అనుచరుడు అరెస్ట్!
తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ కొణతం దిలీప్ అరెస్ట్ అయ్యారు. ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
అయితే, రాష్ట్రంలో నెలకొన్న భారీ వర్షాల కారణంగా విపత్కర సమయాల్లో వరద బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశించినందుకే ఆయనను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందిత.
కాగా, కొణతం దిలీప్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ గా పనిచేశారు. అదే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అనుచరుడిగా కూడా ఉన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని పలు కేసులు సైతం నమోదయ్యాయి. తెలంగాణ లోగోను కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తుందని సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి.
తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ కొణతం అరెస్ట్ అక్రమమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అసమర్థ ప్రభుత్వాన్ని దిలీప్ ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతుందన్నారు.
ప్రశ్నిస్తున్న దిలీప్ గొంతు నొక్కాలనే ఉద్దేశంతో అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. పోలీసులు ఏ కేేసులో అదుపులోకి తీసుకున్నారో కూడా చెప్పలేదన్నారు. ప్రజాపాలన అంటే..ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కటమేనా? అని ప్రశ్నించారు.
కాగా, బీఆర్ఎస్ ఐటీ వింగ్‌లో కీలక బాధ్యతలు పోషించిన దిలీప్ కొణతం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డితోపాటు ప్రభుత్వ కార్యక్రమాలపై విమర్శలు చేస్తున్నారని కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పూర్తి వివరాలు సమర్పించే వరకు అరెస్ట్ చేయరాదని ఆయన హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నారు.
అయితే, తాజాగా, మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అనుచిత పోస్టులు, వ్యాఖ్యలు చేశారని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, గతంలో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించిన సంగతి తెలిసిందే.