ఖమ్మం బయలుదేరిన మంత్రి పొంగులేటి
- సాయంత్రం నుంచి వర్షం కురుస్తుండటంతో దగ్గరుండి పరిస్థితిని సమీక్షించేందుకు రాక
- అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు
ఖమ్మం : భారీ వర్షాల నేపథ్యంలో ఐదు రోజుల పర్యటనను ముగించుకుని శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్ వెళ్లిన తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం సాయంత్రం నుంచి మళ్ళీ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో హుటాహుటిన ఖమ్మం బయలు దేరారు. మున్నేరుకు ముంపు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన తరుణంలో ఖమ్మం వస్తున్నారు.
జిల్లా కలెక్టర్ , సీపీ సహా పాలేరు నియోజక వర్గంలోని ఆయా మండలాల అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అవసరం అయితే అర్థరాత్రి కూడా పరిస్థితి పై సమీక్ష ఉంటుందని కావున అధికారులందరూ అలర్ట్ గా ఉండాలని సూచించారు.