ప్రతీ ఇంటికి వరద సాయం…!
- బాధితులందరినీ ఆదుకునే బాధ్యత మంత్రి పొంగులేటిది
- క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి
- తీర్థాల గ్రామంలో బాధిత కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ
సికే న్యూస్ ప్రతినిధి
ఖమ్మం రూరల్ : పాలేరు నియోజకవర్గంలో వరద ముంపునకు గురైన ప్రతి ఇంటికీ వరదసాయం అందిస్తామని, బాధితులందరినీ ఆదుకునే బాధ్యత మంత్రి పొంగులేటి తీసుకున్నారని క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో ఇస్తున్న నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల గ్రామంలో దయాకర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్పపీడనం కారణంగా విస్తారంగా వర్షాలు పడటంతో ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాలు మున్నేరు ముంపునకు గురయ్యాయన్నారు. నష్టపోయిన ప్రతీ కుటుంబానికి రెండు మూడు రోజుల్లో ఆసరా అందుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ సాయంతో పాటు మంత్రి పొంగులేటి సాయం కూడా బాధిత కుటుంబాలకు అందుతుందని హామీ ఇచ్చారు. అనంతరం తీర్థాల కూడలి సమీపంలోని మున్నేరు వరద ఉధృతి తీరు పరిశీలించారు. క్రమక్రమంగా ఉధృతి తగ్గుతుందని ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ ఇన్ స్పెక్టర్ ముస్కా రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కల్లెం వెంకట్ రెడ్డి, బోడా వెంకన్న, కృష్ణయ్య, మంజ్యా, సేవియా, భద్రయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు.