సిరిసిల్లలో సైకో పీఈటీ.. వేధింపులు తట్టుకోలేక రోడ్డెక్కిన విద్యార్థులు
సిరిసిల్లలో ఓ సైకో పీఈటీ హద్దులు దాటి ప్రవర్తిస్తోందని, ఆమె వేధింపులు తట్టుకోలకే పాఠశాల, కళాశాల విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపారు.
జిల్లాలోని తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాలలో జోష్ణ పీఈటీ విధులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో ఆమె తమ పట్ల అరాచకంగా ప్రవర్తిస్తోందని, గురువారం ఉదయం 5 గంటల సమయంలో విద్యార్థులు సిరిసిల్ల, సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న పీఈటీ జోష్ణను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. పీఈటీ జోష్ణ తమను ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతూ, ఎక్కడ పడితే అక్కడ కొడుతుందని మండిపడ్డారు.
విద్యా బుద్ధులు నేర్పే గురువే.. బూతులు మాట్లాడితే ఆమె నుంచి ఏం నేర్చుకోవాలి.. ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు. తన క్లాస్ సమయంలో కూడా వేధిస్తోందని, స్నానం చేస్తుంటే బట్టలు లేకుండా వీడియోలు తీస్తూ, రక్తం వచ్చేలా కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నిసార్లు ప్రిన్సిపల్‌తో పాటు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 580 మంది విద్యార్థులు ఉన్న పాఠశాల, కళాశాలలో కనీస వసతులు కూడా లేవని అన్నారు.
ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఎంఈవో, పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పినా నిరసన విరమించేందుకు వారు ఒప్పుకోలేదు. దీంతో ఎంఈవో రఘుపతి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కొనసాగుతున్న పీఈటీ జోష్ణను విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు.