డాక్టర్ల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి..ఆసుపత్రి ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
Hyderabad : తిలక్ నగర్ అభయ బీబీసీ హాస్పిటల్ లో ఏడాదిన్నర వయసున్న చిన్నారి (ఆరాధ్య) మృతి చెందింది.వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని ఆరోపిస్తూ బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
అలీ కేఫ్ చౌరస్తా ప్రాంతానికి చెందిన ప్రశాంత్, శైలజ దంపతుల కుమార్తె ఆరాధ్య గత రెండు రోజులుగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతుంది.
దీంతో తల్లిదండ్రులు చే నంబర్ లోని యశోద కృష్ణవేణి ఆసుపత్రి వైద్యుడు ప్రేమ్ కుమార్ వద్దకు చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. అయితే ఆయన తిలక్ నగర్ లోని అభయ బీబీసీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని రిఫర్ చేశారు.
దీంతో శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆరాధ్యను తల్లిదండ్రులు అభయ బీబీసీ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. అయితే “ఫస్ట్ డబ్బులు కట్టండి ఆ తర్వాతే చికిత్స చేస్తామం” అని ఇక్కడి వైద్యులు చెప్పడంతో తండ్రి ప్రశాంత్ రూ.15000 అడ్వాన్స్ చెల్లించాడు.
డబ్బులు కట్టిన తర్వాత కూడా చికిత్స ఆలస్యం చేయడంతో చిన్నారి ఆరాధ్య పరిస్థితి విషమించి ఆసుపత్రిలో కన్ను మూసింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అభయ బీబీసీ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు మృతి చెందిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.
తమ కూతురి మరణానికి కారణమైన వైద్యులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అభయ ఆసుపత్రి యాజమాన్యం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ జగదీశ్వర్ రావు, సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.