విద్యతో సమాజంలో సమానత్వం సాధ్యం….జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
వీర వనిత చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి స్ఫూర్తిదాయకం
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం, సెప్టెంబర్ 26:
విద్యతో మాత్రమే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
గురువారం వీరనారి చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకొని ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఎదురుగా, వైరా రోడ్డులో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, మహనీయుల జయంతి వేడుకల సందర్భంగా వారి జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలనే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు.
సమాజంలో మార్పు కావాలని, నవ సమాజ నిర్మాణం కావాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారని, కాని ఆ దిశగా పని చేసిన గొప్ప వ్యక్తుల్లో చాకలి ఐలమ్మ ఒకరని కలెక్టర్ అన్నారు.
మన చుట్టూ సమాజంలో ఎక్కడైనా దౌర్జన్యాలు, దుర్మార్గాలు జరుగుతుంటే దానిని మనమే ఆపాలని, సామాన్యులు కూడా అసామాన్యమైన పనులు చేయగలరని చాకలి ఐలమ్మ నిరూపించారన్నారు. చైతన్యంతో ఎవరైనా నవ సమాజం నిర్మాణం కోసం కృషి చేయవచ్చని తెలిపారు.
ప్రపంచంలోనే భారత దేశం అతి గొప్ప దేశమని, ఇక్కడ ప్రతి ఒక్కరూ సమానమని మనం ముందుగా భావించాలని, కుల, మత, ప్రాంత, వర్ణ మొదలగు భేదాలను తొలగించాలని, దీని కోసం చదువును ఆయుధం చేసుకోవాలని, విద్యతో మాత్రమే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని కలెక్టర్ అన్నారు.
విద్య మహిళలకు చాలా కీలకమని, పాఠశాలల సందర్శనలో బాలికలు అధికంగా కనపడ్తుండటం చాలా సంతోషంగా ఉందని, నవ సమాజ నిర్మాణం కోసం ఆ బాలికలే బాటలు వేస్తారని కలెక్టర్ తెలిపారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని, మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వీర వనిత అని అన్నారు. నేటి సమాజంలో కత్తి కంటే కలం (పెన్ను) గొప్పదని, ప్రతి ఒక్కరికి చదువు యొక్క ప్రాముఖ్యత తెలిసిందని అన్నారు.
మన భవిష్యత్తు తరాలు మరింత సురక్షితంగా, మంచి వాతావరణంలో జీవనం గడపాలని, మనం పడిన ఇబ్బందులు వారు పడవద్దని ఆశిస్తూ మనమంతా పనిచేయాలని అన్నారు. ప్రజలకు ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు అధికార జిల్లా యంత్రాంగం 24 గంటలపాటు అందుబాటులో ఉంటుందని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి. జ్యోతి, బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత, ఎస్సీ సాధన కమిటీ అధ్యక్షురాలు కే. శ్రీలక్ష్మి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దుంపటి నగేష్, బీసీ సంఘం అడ్వకేట్ మేకల సుగుణారావు, కల్లుగీత సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి అంజయ్య, జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు పిండిప్రోలు రామ్మూర్తి, చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకటప్పయ్య, ప్రొఫెసర్ డా. బి.వి. రాఘవులు, రజక సంఘం జక్కుల వెంకట రమణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు వేంకటేశ్వర్లు, తుపాకుల వెంకన్న, యడవల్లి భాస్కర్, బిసి సంఘాల నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.