కామాంధుడిలా మారిన ప్రధానోపాధ్యాయుడు
వైరా : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి బంగారు భవిష్యత్ కు బాటలు వేయాల్సిన ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కామాంధుడిగా మారాడు. ప్రధానోపాధ్యాయుడి పదవికి కళంకం తెస్తూ పాఠశాలలోని విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. విద్యార్థినీల ప్రైవేట్ పార్టులను టచ్ చేస్తూ పైశాచికానందం పొందాడు.
సదరు ప్రధానోపాధ్యాయుడి వెకిలి చేష్టలు శృతిమించటంతో విద్యార్థినీలు విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు శనివారం మధ్యాహ్నం పాఠశాలలో ఆందోళన చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రధానోపాధ్యాయుడు పాఠశాల నుంచి పరారయ్యాడు.
ఇది వైరా మండలంలోని పాలడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడు చావా శ్రీనివాసరావు తీరు. గత సంవత్సర కాలంగా ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాసరావు విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్టు తెలిసింది.
పాఠశాలలోని 8, 9, 10వ తరగతి విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ విద్యా వ్యవస్థకే మాయని మచ్చలా నిలిచాడు. విద్యార్థినీల ప్రైవేట్ పార్టులపై చేతులు వేస్తూ కీచకంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా విద్యార్థులను బూతులు తిడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
ప్రధానోపాధ్యాయుడి చేష్టలకు విసిగిన విద్యార్థినీలు విషయాన్ని తల్లిదండ్రులకు, గ్రామస్తులకు వివరించారు. దీంతో వారు పాఠశాలకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన ప్రధానోపాధ్యాయుడు పరారయ్యారు.
తల్లిదండ్రుల ఆందోళన విషయం తెలుసుకున్న ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు పాలడుగు పాఠశాలకు హుటాహుటిన చేరుకొని ఆఫీసు రూమ్ లో ఉపాధ్యాయులతో మాట్లాడుతుండగా తల్లిదండ్రులు ఆ రూమ్ కి తాళం వేసి ఆందోళన చేశారు.
వెంటనే డీఈఓ వచ్చి కీచక ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఎంఈఓ ను నిర్బంధించిన విషయం తెలుసుకున్న వైరా సీఐ ఎన్.సాగర్ పాలడుగు చేరుకొని ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులను శాంతింపజేసి గదికి వేసిన తాళాన్ని తీయించారు.
ఎంఈఓ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న డీఈఓ సోమశేఖర్ శర్మ పాఠశాలకు చేరుకొని అసలు విషయాన్ని విద్యార్థినీలను, తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.
ఒక దశలో తల్లిదండ్రులు పాఠశాలలోని కుర్చీలు, బల్లలను విరగకొట్టారు. కీచక ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోకుంటే తాము ఎంతటి ఆందోళనకైనా సిద్ధమని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.