చైతన్య పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓజోన్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యం కోసం వస్తే ప్రాణాలు పోయాయి.నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెంకు చెందిన నిమ్మనగొని నరసింహ (45) అనే వ్యక్తి రామంతాపూర్ లోని శ్రీ నగర్ కాలనీలో తన భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.
వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. సోమవారం ఛాతిలో నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పడంతో సోమవారం కొత్తపేట లోని ఓజోన్ హాస్పిటల్ లో బంధువులు చేర్పించారు. యాంజియోగ్రామ్ నిర్వహించిన వైద్యులు గుండెకు స్టంట్ వేయాలని అందుకు రూ. 2 నుండి 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులకు తెలిపారు.
మా వద్ద అంత డబ్బులు లేవని ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయాలని వైద్యులకు తెలిపారు. అందుకు హాస్పిటల్ వైద్యులు ఆరోగ్య శ్రీ అప్రూవల్ కోసం పంపించారు. రెండు రోజులుగా చికిత్స చేయకుండా ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని బంధువులు ఆరోపించారు.
రెండు రోజుల తర్వాత బుధవారం ఆరోగ్యశ్రీ అప్రూవల్ వచ్చినట్లు తెలిపారు. అదేరోజు హాస్పిటల్ డాక్టర్లు ఆపరేషన్ చేసారని ఆపరేషన్ చేసిన కొద్దిగంటల్లోనే సాయంత్రం 5 గంటల తర్వాత నరసింహకు తీవ్ర గుండెనొప్పి రావడంతో మృతిచెందాడని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు మృతిని బంధువులు ఆరోపించారు.
మాకు న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు మృతిని కుటుంబ సభ్యులు, బంధువులు బైఠాయించి ఆందోళన చేశారు.
ఈ విషయం పై హాస్పిటల్ యాజమాన్యాన్ని వివరణ కోసం సంప్రదించగా అందుబాటులో రాలేదు. ఆరోగ్యశ్రీ బాధ్యులను అడగడంతో సోమవారం యాంజియోగ్రామ్ నిర్వహించారని, అత్యవసరమైతే టెలికాల్ ద్వారా ఆరోగ్యశ్రీ అప్రూవల్ తెప్పించుకునే వారని తెలిపారు.
అత్యవసరం కాకపోవడంతోనే రెండు రోజులు వేచి ఉండడం జరిగిందని, ఈ విషయం వైద్యులకు తెలుసని ఆమె సమాధానం ఇచ్చారు. 100 నెంబర్ ద్వారా సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు హాస్పిటల్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.