మద్యం మత్తులో తండ్రిని చంపిన కొడుకు…
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో దీపావళి పండుగ పూట విషాదం నెలకొంది. పేకాట ఆడేందుకు తండ్రిని డబ్బులడిగితే ఇవ్వడానికి నిరాకరించాడన్న కోపంతో.. ఓ కొడుకు తండ్రినే చంపేసిన ఘటన చోటు చేసుకుంది.
మృతుడు సాయిలు బంధువు శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. నెమ్లి గ్రామానికి చెందిన వంకాయల సాయిలును, ఆయన కొడుకు హన్మాండు దీపావళి రోజున పేకాట ఆడేందుకు డబ్బులు అడిగాడు. తాగుడు, పేకాటకు బానిసై పెళ్ళాం పిల్లలను పట్టించుకోకుండా తిరుగుతున్నాడనే ఉద్దేశంతో..
కొడుకు పేకాటకు డబ్బులడిగితే తన దగ్గర లేవని చెప్పాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భార్యను అడిగినా డబ్బులు ఇవ్వకపోవడంతో భార్యతో కూడా గొడవ పడ్డాడు. తరువాత తండ్రిని డబ్బుల కోసం వేధించాడు.
కొడుకు ఎంత గోల పెట్టినా తండ్రి సాయిలు కొడుక్కు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో కోపోద్రిక్‌తుడైన హన్మాండు అప్పటికే మద్యం మత్తులో ఉండటంతో తండ్రి సాయిలు ను వ్యవసాయం పనుల కోసం ఉపయోగించే కొంకితో తండ్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో సాయిలు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
నసురుల్లాబాద్ పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకుని.. ఘటనపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.