గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య…
సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్‌లోని మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.కాగా సిబ్బంది, ఉపాధ్యాయులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.
సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ మదీనాగూడలోని ఎంఏ నగర్ కాలనీకి చెందిన బాలిక (15) కొత్లాపూర్‌లోని మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.
పాఠశాల ఆవరణలోని వసతి గృహంలో ఉంటోంది. ఆమె శనివారం వేకువజామున 5 గంటలకు నిద్రలేచి, తనకు హోంవర్క్ ఉందని.. తరగతి గదికెళ్లి రాసుకుంటానని తోటి విద్యార్థినులకు చెప్పి వెళ్లింది. అనంతరం గది లోపల నుంచి గడియ పెట్టుకొని సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
కొంతసేపటి తర్వాత స్నేహితులు తరగతి వద్దకు వెళ్లి తలుపులు తీసే ప్రయత్నం చేయగా తెరుచుకోలేదు. వారు వెంటనే కాపలాదారుకు సమాచారం ఇచ్చారు. ఆయన గడ్డ పలుగుతో బద్దలుకొట్టి తలుపులు తెరవగా విద్యార్థిని ఉరేసుకొని విగతజీవిగా మారి ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించారు. బాలిక కుటుంబసభ్యులు ఆసుపత్రి మార్చురీకి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాల వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. తమ బిడ్డను సిబ్బంది, ఉపాధ్యాయులు చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని, ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థిని కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.