మార్పు మార్పు అంటే ముద్రలు మార్పు, విగ్రహాల మార్పా?
మార్పు మార్పు అంటే చారిత్రక కట్టడాల మార్పు…ఇదేనా రేవంత్ రెడ్డి
మార్పు మార్పు అని గద్దెనెక్కి అన్ని మారుస్తుండు
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక నిరుపేద రైతు కూలీగా మార్చడాన్ని నిరసిస్తున్నాం
దేవతలకు కిరిటాలు బంగారాలు లేవా..మరి తెలంగాణ తల్లికి ఎందుకు వద్దు
నీకు చేతనైతే రాష్ట్ర పక్షిని మార్చు, రాష్ట్ర వృక్షాన్ని మార్చు
కెసిఆర్ నామ జుపం లేనిది నీకు పొద్దే గడవదు
హిరణ్యకశపునికి హరినామ స్మరణ… నీకు కేసీఆర్ నామస్మరణ రెండిట్లో తేడానే లేదు
తెలంగాణ తల్లికి మెట్టెలు ఉన్నవి పుస్తే ఎక్కడ పోయింది
కెసిఆర్ ప్రభుత్వంలోని తెలంగాణ తల్లి విగ్రహం ప్రజలు కవులు కళాకారులు మేధావులు ఆమోదించిన విగ్రహం
ఈనెల 9 తారీఖున తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసనలు తెలుపుతాం
మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వర ప్రసాద్ రావు
సి కే న్యూస్ షాద్ నగర్ : డిసెంబర్ 7
మార్పు మార్పు అంటూ ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాల్సింది పోయి ప్రభుత్వ చిహ్నాలు మార్చడం, రాచరికపు భవనాల ఆనవాళ్లు లేకుండా చేయడం, చివరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం, అది కూడా నిరుపేద మహిళా రైతు వ్యవసాయ పొలంలోకి వెళుతున్నట్లు ఉన్న విగ్రహాన్ని రూపొందించడం నీకే చెల్లిందని, ఏం తెలంగాణ తల్లికి కిరీటము, బంగారు నగలు, నడుముకు వడ్డాణం, పట్టుచీర ఉండవద్దా, నీ భార్య పిల్లలలు ఒంటి మీద సొమ్ములు లేకుండానే తిరుగుతున్నారా అంటూ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజ వరప్రసాద్ తీవ్రంగా ప్రశ్నించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నట్టు తెలంగాణ తల్లి విగ్రహాన్ని బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయలేదని 70, 80 సంవత్సరాల నుండి కవులు కళాకారులు మేధావులు తమ అద్భుతమైన ఆలోచనలతో ప్రజలు రూపొందించుకున్న విగ్రహమే తెలంగాణ తల్లి విగ్రహం కానీ బిఆరెస్ పార్టీ తయారు చేసిన విగ్రహం కాదని తెలిపారు. ముస్లిం సోదరులందరి నానుడి ప్రకారం మాకే పైరొంకే నిచ్చే జన్నత్ హై, అంటే తల్లి పాదాల కింద స్వర్గం ఉన్నట్టు నీకు తెలియదా, దైవం కంటే కూడా తల్లి గొప్పదన్న విషయం మరచి నీకు అనుకూలంగా వున్న మీడియాతో అసత్య ప్రచారం చేస్తూ దేవత లాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని మార్చే ప్రయత్నం వెనుక పెద్ద రాజకీయ కుట్ర కోణం ఉందంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణ తల్లికి మెట్టెలు పెట్టినవ్, మరి పుస్తె ఎవడు మాయం చేసిండంటూ ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలు తెలంగాణ తల్లిని తమ దైవంగా భావించడం మీరు ఓర్వలేక పోతున్నారా అంటూ ప్రశ్నించారు. అదేవిధంగా 850 సంవత్సరాల కిందటి ఏకశిలా తోరణాన్ని మనం రాజముద్రంగా తీసుకుంటే దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. రాచరిక చిహ్నాలు ఉండనీయం అని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుల్లారా సాక్షాత్తు ప్రధానమంత్రి జండా ఎగరవేస్తున్న ఎర్రకోట రాచరిక చిహ్నం కాదా, ఉస్మానియా హాస్పిటల్ రాచరిక చిహ్నం కాదా, చార్మినార్ రాచరిక చిహ్నం కాదా, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న భవనం రాచరిక చిహ్నం కాదా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొత్త రాష్ట్రానికి అవసరమైన అన్ని రకాల వసతులు సదుపాయాలు, ప్రభుత్వ ముద్రలు, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి అవసరమున్న ఆ సందర్భంలో అప్పటి ప్రభుత్వం వాటన్నింటినీ ఏర్పాటు చేసింది కానీ, మీలాగా కేసీఆర్ మీద కక్షతో ఆయన ఏర్పాటు చేసిన ఆనవాళ్లను తుడిచేస్తాననడం, మీకు దమ్ముంటే రాష్ట్ర పక్షి పాలపిట్టను, రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టును మార్చండి చూస్తామంటూ హెచ్చరించారు. భరతమాతకు కిరీటం లేదా, ఇందిరాగాంధీ హయాంలో భరతమాతకు గుడి కట్టలేదా, పక్కనే కర్ణాటకలో కన్నడ మాతాకు నగలు, తమిళనాడులోని తమిళ తాయి కి దేవత స్వరూపం లేదా, అన్ని రాష్ట్రాల వారికి అన్నీ ఉన్నప్పుడు మరి మన తెలంగాణ తల్లికి కిరీటము నగలు వడ్డాణము పట్టుచీర ఎందుకు ఉండొద్దు అంటూ ప్రశ్నించారు. 1953లో అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పాటయిన తెలుగుతల్లి విగ్రహం ఉమ్మడి రాష్ట్రం తో పాటు ప్రస్తుతం అలాగే అధికారిక చిహ్నంగా కొనసాగడం లేదా అని ప్రశ్నించారు. గత పదేళ్ల కాలం పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టినప్పుడు, తెలంగాణ చిహ్నమైన తెలంగాణ తల్లి విగ్రహం కడు నిరుపేద రైతు గానే మిగిలిపోవాల్నా అంటూ ఎద్దేవా చేశారు. అంతెందుకు నీ ప్రభుత్వం ఏర్పడ్డాక మహాలక్ష్మి పథకం ఏర్పాటు చేస్తున్నావ్ కదా మరి మహాలక్ష్మి దేవత కాదా, ఆమెకు కిరీటం ఉండదా అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని, రేవంత్ రెడ్డి కోతి చేష్టల్ని తెలంగాణ సమాజం గ్రహిస్తుందని, గమనిస్తుందంటూ రేవంత్ రెడ్డికి భయపడి నోరులు మూసుకున్న మేధావులు దీనికి సమాధానం చెప్పాలని ఆయన మేధావులను కోరారు. ఏ మతంలోనైనా తల్లి అందరికీ దేవత లాంటిదని అలాంటి తల్లి స్థానాన్ని కించపరచకుండా కాంగ్రెస్ నాయకులు నడుచుకోవాలని, అంతెందుకు మేరీమాత విగ్రహానికి కూడా కిరీటం లేదా అని ప్రశ్నించారు. కంచు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ తెలంగాణ తల్లిని నాలుగు గోడల మధ్య బంధించడం భావ్యం కాదని, అది ఎప్పటికైనా తుప్పు పడుతుందని, ఈనెల 9వ తేదీన జరిగే నూతన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు నిరసనలు తెలుపుతూ పాలాభిషేకం చేస్తామని ఈ సందర్భంగా రాజ వరప్రసాద్ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఆయనతోపాటు బీఆరెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.