కొత్తగా 300 ఆస్పత్రులు..? 78 పీహెచ్సీలు, 220 సబ్ సెంటర్లు…
రాష్ట్రంలో దాదాపు కొత్తగా మరో 300 ప్రభుత్వ ఆస్పత్రులు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 78 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 220 సబ్ సెంటర్లు ఉన్నాయి.
వీటి ఎస్టాబ్లిష్ కు వైద్యారోగ్యశాఖ ప్రపోజల్ పెట్టగా, ఆర్థిక శాఖ సుమారు రూ.337 కోట్లు అప్రూవల్ అయినట్లు అధికారులు తెలిపారు. ఆయా హాస్పిటల్స్ నిర్మాణాలకు త్వరలోనే శంకుస్థాపనలు చేయనున్నారు.
ఇందులో మెజార్టీ ఆస్పత్రులు ఆదివాసీ, గిరిజన, కోల్ బెల్ట్ ఏరియాల్లో ఉంటాయని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ప్రభుత్వం తరపున ఆదేశాలూ వెళ్లాయి.
ఆసుపత్రులు వేగంగా అందుబాటులోకి వచ్చేలా సహకరించాలని సర్కార్ సూచించింది. ప్రజా ప్రభుత్వం రెండేళ్ల సెలబ్రేషన్స్ లోపు ఈ హాస్పిటల్స్ అన్నింటినీ ప్రారంభించేలా ప్రభుత్వం టాస్క్ పెట్టుకున్నది. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వీటి నిర్మాణాలను శరవేగంగా నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
ఎందుకీ నిర్ణయం..?
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 887 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4645 సబ్ సెంటర్లు ఉన్నాయి. అయితే వీటన్నింటినీ జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. దీంతో కొన్ని ఏరియాల్లో వీటి సేవలు అందుబాటులో లేవు.
దీంతో ప్రాథమిక వైద్యం కోసం ఏరియా, జిల్లా ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది. ఇది పేషెంట్ కు దూర ప్రయాణం కావడంతో పాటు సమయం, ఆర్థికంగానూ భారంగా మారింది. అంతేగాక టీవీవీపీ ఆసుపత్రులపై ఆటోమెటిక్ గా పేషెంట్ల లోడ్ పెరుగుతుంది.
ఈ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశాలతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే పీహెచ్సీలు, సబ్ సెంటర్లను డిస్టెన్స్ బేస్డ్ లో నూ ఎంపిక చేశారు. ఇప్పటికే అన్ని జిల్లాలు వారీగా ఏరియాలను సెలక్ట్ చేశారు.
బేసిక్ ట్రీట్మెంట్ తోనూ గోల్డెన్ అవర్ సేఫ్?
గ్రామాల్లో సబ్ సెంటర్లు, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండటం వలన పేషెంట్లకు వేగంగా ప్రాథమిక చికిత్స అందుతుంది.
యాక్సిడెంట్ కేసులు, గర్భిణీల ఎమర్జెన్సీ సమయంలో పీహెచ్ సీలు కీలకంగా మారతాయి. పీహెచ్ సీల్లో సకాలంలో చికిత్స అందించడం వల్ల జిల్లా హాస్పిటళ్లలో 90 శాతం కేసులను రికవరీ చేసే ఛాన్స్ ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అంబులెన్స్ రీచింగ్ టైమ్ యావరేజ్ గా 25 నిమిషాలు ఉన్నది. తాజాగా ప్రారంభించిన 213 అంబులెన్స్ లతో ఆ సమయం 13కి తగ్గింది. కొత్తగా మరో 80 అంబులెన్స్ లను తీసుకువస్తే సగటు టైమింగ్ పది నిమిషాలకు చేరుతుంది.