ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సర్వే షురూ
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం క్షేత్ర స్థాయిలో డేటా సేకరణ ప్రక్రియ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రారంభమైంది. ఆయా గ్రామాలు, పట్టణాల వారీగా సిబ్బంది ఈ పనిలో నిమగ్నమయ్యారు.
రెండు వారాల్లోగా కంప్లీట్ చేయాలన్న లక్ష్యంతో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, వారు అందుబాటులో లేని చోట ఐకేపీ సీసీలు పనిచేస్తున్నారు.
ఈ డేటా సేకరణ సిబ్బందికి ఇప్పటికే జిల్లా స్థాయిలో అధికారులు ట్రైనింగ్ ఇచ్చారు. వారి మొబైల్ ఫోన్లలో ఇందిరమ్మ ఇండ్ల యాప్ ను ఇన్స్టాల్ చేశారు. ఆ యాప్‌ల్లో ఫీల్డ్ ఎంక్వైరీ చేసిన విషయాలు నమోదు చేస్తున్నారు. అప్పుడే లబ్ధిదారుల ఫొటోలను కూడా తీసుకుంటున్నారు.
6.36 లక్షల అప్లికేషన్లు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా తీసుకున్న ఈ దరఖాస్తుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 6.36 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 3,57,869, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,76,638 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నింటినీ అప్పట్లోనే ఆన్ లైన్ చేశారు.
ఈ డేటాను యాప్ లో నిక్షిప్తం చేసి సిబ్బందికి అందజేశారు. ఆ డేటా ప్రకారం దరఖాస్తుదారుల దగ్గరకు వెళ్లిన సిబ్బంది, వారి నుంచి వివరాలను సేకరిస్తారు. గతంలో ఇచ్చిన డేటాలో ఏవైనా తప్పులు ఉంటే ఇప్పుడు యాప్ ద్వారా సరిచేసే అవకాశాన్ని కల్పించారు. ఆధార్, ఫోన్‌నెంబర్, రేషన్ కార్డు నెంబర్లలో తప్పులుంటే సరిచేయొచ్చు.
10 నియోజవర్గాలకు 35వేల ఇండ్లు
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నియోజకవర్గానికి 3,500 ఇస్తామని ప్రకటించడంతో, ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు కలిపి 35 వేల ఇండ్లు రానున్నాయి. దీని కింద లబ్ధిదారులకు బేస్ మెంట్, శ్లాబ్, వాల్స్, ఫైనల్ పేమెంట్ ద్వారా నాలుగు విడతల్లో రూ.5 లక్షలు మంజూరు కానున్నాయి. ఈ నాలుగు దశల్లో ప్రతి దశకు సంబంధించిన ఫొటోను యాప్ లో అప్ లోడ్ చేస్తేనే, పేమెంట్ మంజూరు చేస్తారని అధికారులు చెబుతున్నారు.
యాప్‌లో నమోదు చేస్తున్న వివరాలు..
దరఖాస్తుదారులు సొంత ఇంట్లో ఉంటున్నారా? కిరాయి ఇంట్లో ఉంటున్నారా? లాంటి 30 కాలమ్స్ ను యాప్ లో నమోదు చేస్తున్నారు. ఖాళీ జాగా ఉంటే దాన్ని ఫొటో తీసి అప్లోడ్ చేస్తున్నారు. మొదటి విడతలో ఖాళీ జాగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తుండడంతో, యాప్‌లో తప్పనిసరిగా ఖాళీ జాగా ఫొటోను తీసుకుంటున్నారు. లబ్ధిదారులు కిరాయి ఇండ్లలో ఉంటే ఆ వివరాలను కూడా యాప్ లో ఎంట్రీ చేస్తున్నారు. ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దరఖాస్తుదారులు నివాసం ఉంటున్నట్లయితే ఆ ఇల్లు పూరిల్లు, రేకుల ఇల్లు, పెంకుటిల్లు అనేది కూడా నమోదు చేస్తున్నారు.
ఇంటి లోపలి భాగం, పై భాగం ఫొటోలను తీసుకుంటున్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన స్థలం ఉన్న వారి నుంచి ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్ ను ఫొటో తీసుకుంటున్నారు. గతంలో ఏదైనా ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధిపొందారా అనే వివరాలను ఆరా తీస్తున్నారు. దరఖాస్తుదారుల్లో ఒంటరి మహిళ, దివ్యాంగులు, వితంతు మహిళ ఉంటే వారి సమాచారాన్ని కూడా నమోదు చేస్తున్నారు.