స్థానికసంస్థల రిజర్వేషన్లు మార్పు.. ఇక ఐదేళ్లకు ఒకసారి చేంజ్
గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఐదేండ్లకోసారి రిజర్వేషన్లు మారనున్నాయి. సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు ప్రస్తుత ఎన్నికల్లో చేంజ్ కానున్నాయి.
రిజర్వేషన్లు వరుసగా రెండు సార్లు కాకుండా ఒకే సారి ఉండే విధంగా పంచాయతీరాజ్చట్టం 2018లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారు సైతం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో మూడు గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది.
ప్రతి సారీ రిజర్వేషన్లు మార్పు
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఒక సారి రిజర్వేషన్ ఖరారు అది పదేండ్ల పాటు (రెండు టర్ములు) కొనసాగేది.
కానీ ప్రస్తుత ప్రభుత్వం దానిని ఒక టర్మకు కుదించింది. దీని ప్రకారం ప్రతి ఐదేండ్లకోసారీ రిజర్వేషన్లు మారనున్నాయి. రిజర్వేషన్ను ఒక సారరే (ఒక టర్మ్) అమలు చేయాలని వినతులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
ఈ మేరకు చట్టానికి ప్రతిపాదించిన సవరణలకు కేబినేట్ఆమోదం తెలిపింది. చట్ట సవరణతో గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్లకు సంబంధించిన అన్ని రిజర్వేషన్లు మారనున్నాయి.
ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా పోటీ
ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లిదండ్రులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటి వరకు అనుమతి లేదు. దీంతో ముగ్గురు, అంత కన్నా ఎక్కువగా పిల్లలున్న వారు పోటీ చేసేందుకు అనర్హులుగా ఉండేవారు.
అలాంటి వారికి సైతం ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలని కొంత కాలంగా వినతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చట్టానికి ప్రభుత్వం సవరణలు చేసింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చు.
ప్రతి మండలానికీ కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు
ప్రతి మండలంలో కనీసం ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు ఉండేలా ప్రభుత్వం చట్టానికి సవరణలు తీసుకొచ్చింది. ఈ నిర్ణయం ద్వారా తక్కువ జనాభా ఉన్న గ్రామీణ మండలాల్లోనూ కనీసం ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు ఉండనున్నారు.
ఎంపీపీ ఎన్నిక సమయంలో ఎలాంటి సమస్య రాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో ఓటరు జాబితాలో ఓటరు చేరడానికి అర్హత తేదీని సైతం మార్చారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతి ఏడాదికి ఒకసారి అవకాశం కల్పించేది.
కానీ తాజాగా ఏప్రిల్, జూలై, అక్టోబరు ఒకటో తేదీని (ఏడాదిలో మూడు సార్లు) అర్హత తేదీగా మార్చారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా చట్టంలో మార్పులు చేశారు.
సర్పంచ్లను తొలగించేందుకు కలెక్టర్లకు మరిన్ని పవర్స్
సర్పంచ్లు, ఉప సర్పంచ్లను తొలగించే విషయంలో కలెక్టర్లకు మరిన్ని అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. దీనితో పాటుగా అనర్హత వేటు వేసే విషయంలోనూ చట్ట సవరణ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఖర్చు, ఈవీఎంలు, బ్యాలెట్బ్యాక్సుల వినియోగం విషయంలోనూ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు.
వీటితో పాటుగా అసెంబ్లీలో ఆమోదించనున్న పలు బిల్లులకూ కేబినెట్ ఆమోదం తెలపనున్నది. ఓఆర్ఆర్లోపలి 51 గ్రామ పంచాయతీలను దగ్గర్లోని మున్సిపాలిటిల్లో వీలినం చేయడం, హైడ్రా చట్టానికి సైతం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.