అవినీతి అదానీ-అండగా ప్రధాని
జనం చెవిలో బిజెపి పూలు
మోడీ వెనుకే అదానీ – అలా విదేశీ పర్యటనలు ఇలా ఒప్పందాలు!
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయుల కీర్తి వెలుగుపోతుందని తెగ గొప్పలు చెప్పుకుంటున్నారు.
అవినీతిని,నల్లధనాన్ని తరిమి కొట్టడమే లక్ష్యంగా మోడీజీ మహత్తర విజయాలు సాధించారనీ కీర్తిస్తున్నారు.
అసలు అవినీతిపై ఇంతగా సమరం చేస్తున్నాను గనకే తనను ప్రత్యర్థులు వేటాడుతున్నారనీ ఆయన స్వయంగా ప్రజ్ఞలు పలకడమూ ఆలకించాం. తీరా ఇప్పుడు అంతర్జాతీయంగా ఆయన ఆప్తుడైన అదానీ అవినీతి భాగోతాలు బయటపడంతో ఏం చేయాల్లో అర్థంకాక ఇష్టమొచ్చిన ఆరోపణలు చేస్తున్నారు.
పీఎం మోడీ ఏ దేశానికి వెళ్లిన అతని నీడ అదే అదానీ కూడా ఖచ్చితంగా వెళ్తారు..దీనికి కారణం ఏంటంటే.. అదానీ ఓడరేవులు, విమానాశ్రయాలు, విద్యుత్తు, బొగ్గు గనులు, ఆయుధాలలో తన అంతర్జాతీయ వ్యాపార ప్రయోజనాలను విస్తరించేందుకు ఆయన వెంట వెళ్లేవారు. అంటే పీఎం మోదీ కుచేలుడు పాత్ర పోసిస్తే..అతని దోస్తు అదానీ కుబేరుడు పాత్రలో కావాల్సినంత దండుకుంటాడు. అంటే అదానీ ప్రతి అవినీతి బాగోతం వెనక మోదీ అండదండలు మెండుగా ఉన్నాయనే విషయం స్పష్టంగా తెలుస్తుంది…
ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, గ్రీస్, ఇండోనేషియా, ఇజ్రాయెల్, కెన్యా, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు టాంజానియాలో అదానీ గ్రూప్ తన కార్యకలాపాలను విస్తరించింది. అయితే అదానీ అడుగు పెట్టిన ప్రతి దేశంలో అవినీతికి పాల్పడటంతో ఆయా దేశాలు ఇండియా గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు.
తాజాగా అమెరికా న్యాయశాఖ, సెక్యూరిటీలు మరియు ఎక్సేంజ్ కమిషన్(సెక్) దాఖలు చేసిన కేసులు.
అదానీ కంపెనీ 26.5కోట్ల డాలర్లు అంటే 2,200 కోట్ల రూపాయల ముడుపుల చెల్లించింది.
నరేంద్రమోడీ విదేశాలలో మనదేశ ప్రతిష్ట పెంచేందుకు పర్యటనలు చేసినట్లు చెప్పినప్పటికీ అవి అదానీ కోసం చేసిన యాత్రల్లానే ఉన్నాయి.
ఎక్కడికి మోడీ వెళితే అక్కడ అదానీ ప్రత్యక్షం కావడం పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడం ఇదంతా పర్యటనల ముసుగులో జరిగే దందా.
ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్,గ్రీస్, మయన్మార్, ఇండోనేషియా, ఇజ్రాయెల్, కెన్యా, టాంజానియా, నేపాల్,శ్రీలంక ఇలా అనేక ఉదంతాలు బహిరంగంగా తెలిసినవే ఉన్నాయి.
ఆస్ట్రేలియాలో వాణిజ్య లావాదేవీలు నిర్వహిస్తూ పన్నులు ఎగవేసేందుకు అదానీ ప్రయత్నం చేశారు.
ఈ విషయాల్లో గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ప్రముఖుడని హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడిరచింది.
అంతకు ముందు 2017లోనే ఆస్ట్రేలియా మీడియా సంస్థ ఏబిసి సందిగ్దమైన అదానీ కంపెనీల గుట్టు రట్టు చేసింది.
బంగ్లాదేశ్ ప్రభుత్వం విశ్రాంత హైకోర్టు జడ్జితో ఒక కమిటీని ఏర్పాటు చేసి అదానీ కంపెనీతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలు వాటి అవినీతి విషయంపై దర్యాప్తు చేస్తుంది.
వీటిలో మనదేశంలో 1,234 మెగావాట్ల గొడ్డా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు కూడా ఉంది. దీని నుంచి బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరింది.
ఇలాంటి విద్యుత్ ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా లేదు. బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్న జార్కండ్లో దీన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఉత్పత్తి మొత్తాన్ని బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తారు. చిత్రం ఏమిటంటే దీనికి అవసరమయ్యే బొగ్గును తొమ్మిదివేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియాలోని అదానీ గనుల నుంచి రవాణా చేసి ఒడిషాలోని అదానీ పోర్టుకు చేర్చి ఇక్కడ వినియోగిస్తారు. ఆ కేంద్రాన్ని బంగ్లాదేశ్‌లోనే నిర్మించవచ్చు. మనకు కాలుష్యాన్ని పంచి అదానీకి లాభాలు తెచ్చే ఈ ప్రాజెక్టును మోడీ సర్కార్ ఆమోదించింది. దీని కోసం ప్రత్యేకంగా రైలు మార్గాన్ని విస్తరించి అదానీకి అప్పగించింది.
అదానీ కంపెనీలతో కుదుర్చుకున్న 250 కోట్ల డాలర్ల విలువ గల ఒప్పందాలను రద్దు చేస్తూ కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించాడు. అమెరికా కేసుల వార్త తెలియగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.
జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండవ రన్‌వే, విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణం వంటివి ఉన్నాయి.
ఈ ఒప్పందాలలో పారదర్శకత లేదని, జనం సొమ్ము దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రతిపక్షాలు, మీడియా ధ్వజమెత్తాయి.
కెన్యా ఒప్పందాలు ఎలా జరిగాయో చూస్తే అదానీ కోసం నరేంద్రమోడీ తన అధికారాన్ని ఎలా వినియోగించారో అర్ధం చేసుకోవచ్చు.
అదానీ కంపెనీల అక్రమాల గురించి హిండెన్‌బర్గ్ పరిశోధనా సంస్థ నివేదిక వెల్లడించింది.
చిత్రం ఏమిటంటే కెన్యా అధ్యక్షుడు రూటో 2023 డిసెంబరు ఐదున ఢిల్లిలో ప్రధాని నరేంద్రమోడీని కలుసుకున్నారు.హైదరాబాద్ హౌస్‌లో వారి భేటీ సందర్భంగా అక్కడ గౌతమ్ అదానీ ప్రత్యక్షం. మోడీఅదానీ మధ్య ఎంత సాన్నిహిత్యం లేకపోతే ఇద్దరు దేశాధినేతల మధ్య దూరగలరు ?
డిసెంబరులో మోడీరూటో భేటీ, మూడునెలలు తిరక్కుండానే ఈ ఏడాది మార్చినెలలో నైరోబీ విమానాశ్రయ రెండవ రన్‌వే ఏర్పాటుకు అదానీ కంపెనీ డిపిఆర్ సమర్పించటం వెంటనే ఆమోదం చకచకా జరిగిపోయాయి.
తూర్పు ఆఫ్రికాలోని టాంజానియాలో బాగామోయో రేవు అభివృద్దికి చైనా కంపెనీతో కుదిరిన అవగాహనను అక్కడి ప్రభుత్వం 2019లో రద్దు చేసుకుంది.
ఆ రేవుతో పాటు మరో రెండు రేవులను అభివృద్ధి చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు అదానీ కంపెనీ అబుదాబీ కంపెనీ సంయుక్తంగా ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
2023 అక్టోబరులో అధ్యక్షురాలు సమియా సులు హసన్ భారత సందర్శనకు వచ్చినపుడు మోదీ సమక్షంలోనే మనదేశంతో అనేక ఒప్పందాలు కుదిరాయి. అదానీ కంపెనీ టాంజానియా దారుసలామ్ రేవులో కంటెయినర్ జెట్టీని అభివృద్ది చేసేందుకు 30 ఏండ్ల రాయితీ ఒప్పందం చేసుకుంది.
విద్యుత్ లైన్ నిర్మాణం గురించి కూడా అదానీ కంపెనీ అమెరికా కంపెనీతో కలసి చేపట్టేందుకు టాంజానియా సంప్రదింపులు జరిగాయి.
మయన్మార్‌లోని యంగూన్ రేవులో ఒక జెట్టీని అభివృద్ధి చేసేందుకు 2019లో కాంట్రాక్టు పొందినట్లు అదానీ కంపెనీ ప్రకటించింది.
అంతకు ముందు మయన్మార్ మిలిటరీ జనరల్ మిన్ అంగ్ లైయింగ్‌తో గౌతమ్ అదానీ కుమారుడు కరన్ అదానీ భేటీ అయ్యాడు.
సదరు అధికారి గుజరాత్‌లోని ముంద్రా రేవును సందర్శించాడు.ఆ సందర్భంగా మిలిటరీ జనరల్, అతనితో పాటు వచ్చిన అధికారులకు ‘‘బహుమతులు’’ ముట్టచెప్పారు.
ఆ తరువాత అంగ్‌సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి లైయింగ్ అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. నియంతలతో కూడా అదానీ తన కంపెనీల కోసం చేతులు కలిపారన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం.
మిలిటరీ పాలకులపై అమెరికా ఆంక్షలు విధించినా అదానీ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం కలగలేదు.
మిలిటరీ అధికారుల కనుసన్నలలో నడిచే మయన్మార్ ఎకనమిక్ కార్పొరేషన్‌కు అదానీ మూడు కోట్ల డాలర్లు చెల్లించిందని, అవి ముడుపులని ఆరోపణలు వచ్చాయి.
శ్రీలంక ప్రభుత్వంతో గతంలో అదానీ కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందాలు చాలా ఉన్నాయి.
వీటిలో 44 కోట్ల డాలర్లతో తలపెట్టిన గాలిమరల విద్యుత్ ప్రాజెక్టులలో చాలా అవకతవకలు జరిగాయి.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన లంకకు మనదేశం సాయం చేసింది. దానికి ప్రతిగా మోడీ మనదేశానికి ఉపయోగపడే పని చేయాల్సిందిపోయి తాము చెప్పిన అదానీకి ప్రాజెక్టులను అప్పగించాలని కోరటం అధికార దుర్వినియోగం కాదా..
మోదీ వత్తిడి కారణంగానే గాలి మరల విద్యుత్ ప్రాజెక్టును అదానీకి కట్టబెట్టినట్లు అక్కడి అధికారే స్వయంగా పార్లమెంటరీ కమిటీ ముందు వెల్లడిరు.
అదానీకి కట్టబెట్టేందుకు పోటీ లేకుండా అక్కడి చట్టాన్నే మార్పించారు మన మోదీ.
మోడీ సర్కార్ దన్నుతో కొలంబో రేవులో సగం వాటాతో తూర్పు కంటెయినర్ జట్టీ అభివృద్ధి, నిర్వహణకు అదానీని రంగంలోకి దించాడు.
నలభై సంవత్సరాల తరువాత తొలిసారిగా భారత ప్రధానిగా నరేంద్రమోడీ 2023 ఆగస్టులో గ్రీస్ పర్యటనకు వెళ్లారు. అదీ కూడా అదానీ కంపెనీల విస్తరణ కోసమే. ఎందుకంటే ఇరుదేశాల నేతల మధ్య రేవుల గురించి చర్చ జరిగింది.
2023 సెప్టెంబరు ఏడున మోడీ ఇండోనేషియా పర్యటన జరిపారు.నెల రోజులు కూడా తిరగక ముందే అదానీ ప్రత్యక్షమై సబాంగ్ రేవు గురించి అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఇలా గత పదేండ్లలో అదానీ కంపెనీలు విదేశాల్లో విస్తరణకు మోడీ సహకరించారన్నది స్పష్టం. విచారణ జరిపితే వాస్తవాలన్నీ బయటపడతాయి. అలాంటి చిత్తశుద్ది కేంద్ర ప్రభుత్వానికి ఉందా ?