సభలో మాటల యుద్ధం.. కోమటిరెడ్డి V/S హరీష్ రావు..
నల్గొండ నీటి వ్యవహారంపై అధికార-విపక్షాల మధ్య మాటల సాగింది. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు నల్గొండ జిల్లాలో మూసీ నీటి గురించి పలు ప్రశ్నలు లేవనెత్తారు.ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి సమాధానాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు రియాక్ట్ అయ్యారు.
దీంతో అధికార-విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హరీష్‌రావు – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు.
గత ప్రభుత్వంలో నల్గొండ జిల్లా ప్రజలు ఏం పాపం చేశారని మంత్రి ప్రశ్నించారు. మల్లన్నసాగర్ నిండా నీళ్లు దాచుకుందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నల్గొండను నిర్లక్ష్యం చేశారని, అందుకే ప్రజలు ఓటుతో బుద్ది చెప్పారన్నారు.
తనను ప్రశ్నించే హక్కు హరీశ్‌రావుకు లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. డిప్యూటీ లీడర్‌వా? ఏ హోదాలో మైక్ అడుగుతున్నావు, మాట్లాడుతున్నావని ప్రశ్నించారు. ఏడాదిగా ప్రతిపక్షనేత సభకు రాకపోవడాన్ని గుర్తు చేశారు.
ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఒక్కసారి రాలేదన్నారు సదరు మంత్రి. బీఆర్ఎస్‌కు సభలో లీడర్ లేదు, డిప్యూటీ నేత లేరు.. ఆయన కేవలం శాసనసభ్యుడు మాత్రమేనన్నారు. ఈలోగా స్పీకర్ జోక్యం చేసుకున్నారు.
మనం పెట్టుకున్న రూల్స్‌ని మనమే బ్రేక్ చేస్తామా? అంటూ స్పీకర్ కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలోకి ప్లకార్డులు తీసుకురావద్దని, వెల్‌లోకి ఎవరూ వెళ్లవద్దని సూచన చేశారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం ప్రశ్నపై మంత్రి ఉత్తమ్ కుమార్ రియాక్ట్ అయ్యారు. మూసీ నదీ జలాల ద్వారా ఫ్లోరైడ్ ప్రాంతానికి నీరు అందడం సంతోషమన్నారు. గతంలో కొంత పని జరిగి ఆగిపోయిందన్నారు. మళ్లీ ఆ పనులను చేపట్టామన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా సభ్యులకు తాను ఎస్యూరెన్స్ ఇస్తున్నానని తెలిపారు మంత్రి. మూసీ నది జలాలతో 60 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. రెండేళ్లలోమూడు కాల్వలు పూర్తి చేస్తామన్నారు.
భూముల సేకరణకు సభ్యులంతా సహకరిస్తే ఏడాదిలోపు పూర్తి చేస్తామన్నారు. మూసీ పునరుజ్జీవం జరిగితే నల్గొండ జిల్లాకు నీళ్లు వస్తాయని ప్రజలు ఆశలు పెట్టుకున్నారన్నారు.