KTRపై A1 కేసు నమోదు…
హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం. ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏసీబీ విచారించనుంది. ఈ మేరకు ఏసీబీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అనుమతి ఇచ్చింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన అర్వింద్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు అధికారులు ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ 1గా, అర్వింద్‌కుమార్‌ను ఏ2గా చేర్చనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
కాగా, అవినీతి ఆరోపణలపై ఎవరైనా ఎమ్మెల్యేను విచారించాలంటే రాష్ట్ర గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి. కేటీఆర్‌ను ప్రశ్నించేందుకు గవర్నర్ ఇప్పటికే అనుమతిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో శాంతికుమారి.. గవర్నర్ అనుమతి గురించి తెలుపుతూ మంగళవారం ఏసీబీకి లేఖ రాశారు. రూ.55 కోట్ల ఫార్ములా-ఈ నిధుల దుర్వినియోగం కేసులో విచారణకు తమ ముందు హాజరు కావాలంటూ ఏసీబీ కేటీఆర్‌కు నోటీసులు పంపనుంది.
మరోవైపు, పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం శాసనసభలోని సీఎం చాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. కేటీఆర్ కేసుకు సంబంధించిన వివరాలను సీఎంకు వివరించినట్టు సమాచారం.
ఫార్ములా ఈ-కారు రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది.A1గా కేటీఆర్, ఏ2గా అర్వింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డిని ఈ కేసులో నిందితులుగా పేర్కొంది అన్నట్లు సమాచారం.