
మీ ఇంటి పెద్దకొడుకుగా చెప్తున్నా..!
- అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా… నాదీ హామీ
- ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేశాం…. మిగిలినవి కూడా చేస్తాం
- తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
- నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నేలకొండపల్లి : అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత… మీ ఇంటి పెద్దకొడుకుగా నాదీ హామీ అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.
నేలకొండపల్లి మండల పర్యటనలో భాగంగా గువ్వలగూడెంలో అంతర్గత సీసీ రోడ్లకు, కోరట్లగూడెం, ముటాపురం గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా వివిధ పార్టీలకు చెందిన పలువురికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. పలుచోట్ల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో ఇచ్చిన హామీలు అనేకం అమలు చేసిందని…. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయినా మిగిలిన హామీలను కూడా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు రాలేదని ఎవరూ బాధపడొద్దని …. విడతల వారీగా అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.
దాదాపుగా ప్రతీ ఇంటికి ఏదో ఒక్క సంక్షేమ పథకం చేర్చడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రితో పాటు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి , పలువురు జిల్లా, నియోజకవర్గ, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.