BRS కార్పొరేటర్ల సస్పెండ్‌.. జీహెచ్‌ఎంసీ వద్ద ఉద్రిక్తత జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశాల నుంచి బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లను మేయర్‌ విజయలక్ష్మి సస్పెండ్‌ చేశారు. సమావేశానికి అడ్డుపడడంతో పాటు తనపై పేపర్లు విసిరడంతో జీహెచ్‌ఎంసీ సెక్షన్‌ 89/1 ప్రకారం ఆమె ఈ చర్యకు ఉపక్రమించారు. ఆపై రంగప్రవేశం చేసిన మార్షల్స్‌.. బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లను బయటకు తీసుకెళ్లారు. దీంతో బీహెచ్‌ఎంసీ బయటే బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆందోళన చేపట్టగా.. పోలీసులు అరెస్ట్‌ చేసి అక్కడి నుంచి తరలించారు. అంతకు ముందు.. ప్రశ్నోత్తరాలను బీఆర్‌ఎస్‌ …

BRS కార్పొరేటర్ల సస్పెండ్‌.. జీహెచ్‌ఎంసీ వద్ద ఉద్రిక్తత

జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశాల నుంచి బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లను మేయర్‌ విజయలక్ష్మి సస్పెండ్‌ చేశారు. సమావేశానికి అడ్డుపడడంతో పాటు తనపై పేపర్లు విసిరడంతో జీహెచ్‌ఎంసీ సెక్షన్‌ 89/1 ప్రకారం ఆమె ఈ చర్యకు ఉపక్రమించారు.

ఆపై రంగప్రవేశం చేసిన మార్షల్స్‌.. బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లను బయటకు తీసుకెళ్లారు. దీంతో బీహెచ్‌ఎంసీ బయటే బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆందోళన చేపట్టగా.. పోలీసులు అరెస్ట్‌ చేసి అక్కడి నుంచి తరలించారు.

అంతకు ముందు.. ప్రశ్నోత్తరాలను బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. అప్పటికే బయటకు తీసుకెళ్లిన తమవాళ్లను లోపలికి తీసుకురావాలంటూ డిమాండ్‌ చేశారు. అయితే.. బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఎవరో తనకు తెలియదని, ఆ పార్టీ సభ్యులు తనపై పేపర్లు విసిరారని మేయర్‌ విజయలక్ష్మి ఆరోపణలకు దిగారు.

దీంతో.. మేయర్‌కు క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఈ క్రమంలో మేయర్‌ పోడియం వద్ద చేరుకున్న కాం‍గ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్పొరేటర్లు పరస్పరం దూషించుకున్నారు. దీంతో.. సమావేశాన్ని మేయర్‌ మరోసారి వాయిదా వేశారు.

అంతకుముందు.. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశంలో రసాభాస చోటు చేసుకోవడంతో కాసేపు సమావేశాన్ని మేయర్‌ వాయిదా వేశారు.

ప్రజా సమస్యలపై చర్చించాలని బీఆర్‌ఎస్‌ ఫ్లకార్డులతో నిరసనకు దిగగా.. బడ్జెట్‌ ఆమోదం విషయంలో మొండిపట్టుతో ఉన్న కాంగ్రెస్‌ సభ్యులు వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ కార్పొరేటర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో బీఆర్‌ఎస్‌ సభ్యుల్లో కొందరిని మార్షల్స్‌ సాయంతో మేయర్‌ బయటకు పంపించేశారు. ఆపై విపక్షాల ఆందోళన నడుమ గందరగోళం నెలకొనడంతో సభ వాయిదా పడింది.

ఎన్నికల హామీల మాటేంటి?
గురువారం ఉదయం జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభం కాగానే.. ముందుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు మేయర్ ప్రకటించారు. అయితే.. ప్రజా సమస్యలపై ముందు చర్చించాలని బీఆర్‌ఎస్‌, బీజేపీలు పట్టుబట్టాయి. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలు గురించి నిలదీశాయి. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారింది.

ఫ్లకార్డులు పట్టుకుని బీఆర్‌ఎస్‌ సభ్యులు నిరసనకు దిగారు. మేయర్‌ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో సభను వాయిదా వేసిన మేయర్‌.. ఆ వెంటనే బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఇది మరింత అగ్గి రాజేసింది.

ఏకపక్షంగా బడ్జెట్‌ను మేయర్‌ ఆమోదించడంపై నిరసనకు దిగిన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లను కాంగ్రెస్‌ కార్పొరేటర్లు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల చేతుల్లోని ఫ్లకార్డులు లాక్కొని చించేశారు కార్పొరేటర్లు సీఎన్‌ రెడ్డి, బాబా ఫసియుద్దీన్‌. దీంతో.. కార్పొరేటర్లు ఒకరినొకరు తోసేసుకున్నారు.

మేయర్‌ ఎంత విజ్ఞప్తి చేసినా సభ్యులు తగ్గలేదు. మేయర్‌కు వ్యతిరేకంగా కౌన్సిల్‌లో విపక్షాలు ఆందోళనకు దిగారు. దీంతో సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారామె. ఆపై కౌన్సిల్‌ హాల్‌లోకి మార్షల్స్‌ ప్రవేశించి.. బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లలో కొందరిని బయటకు తీసుకెళ్లారు.

అంతకుముందు.. కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపించింది. సర్వసభ్య సమావేశం సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారులు భావించారు. ఈ క్రమంలోనే ఆఫీస్‌ బయట భారీగా పోలీసులు, మీటింగ్‌ హాల్‌ వద్ద మార్షల్స్‌ను మోహరించారు.

'బిచ్చగాళ్లు'గా బీజేపీ కార్పొరేటర్లు

బీజేపీ కార్పొరేటర్ల వినూత్న నిరసనకు దిగారు. బిచ్చగాళ్ల వేషధారణ తో జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్‌కి వచ్చారు. ట్యాక్సులు కడుతున్నా తమ డివిజన్‌లకు నిధులు కేటాయించడం లేదని ఆరోపిస్తున్నారు వాళ్లు.

"మా డివిజన్‌కి నిధులు ఇవ్వండి సారూ.." అంటూ అడుక్కుంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ఇక.. కౌన్సిల్ లో గందరగోళం నెలకొంటే కారకులైన ఆ వ్యక్తులను బయటకు పంపుతామని అధికారులు చెబుతున్నారు.

సర్వసభ్య సమావేశంలో రూ.8,440 కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్‌పై చర్చించనున్నారు. మరోవైపు కౌన్సిల్‌ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగగ్రెస్‌ చర్చలు జరుపుతోంది.

ఈ ఉదయం మంత్రి పొన్నం నివాసంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు చర్చలు జరుపుతున్నారు. ఇక.. ఫిబ్రవరి 10 తర్వాత మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి.

Updated On 30 Jan 2025 5:40 PM IST
cknews1122

cknews1122

Next Story