దానం నాగేందర్ ఇంట్లో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ...

By :  Admin
Update: 2025-02-05 11:30 GMT

దానం నాగేందర్ ఇంట్లో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ...


తెలంగాణ రాష్ట్రరాజకీయం రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయం రసకందాయంగా మారింది. ఒకవైపు ఎస్సీ వర్గీకరణ,కుల గణనతో ప్రజల్లోకి వెళ్లి మంచి మైలేజ్ తెచ్చుకుందామనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి.

కుల గణనపై సొంత పార్టీ ఎమ్మెల్సీ తీవ్ర విమర్శలు చేయడం ప్రతిపక్షానికి కలిసివచ్చింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావడం చర్చకు దారి తీసింది. ఇంతలో బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఇలా వరుస సమస్యలు కాంగ్రెస్ పార్టీని ఊపిరిసలపనీయకుండా ఉక్కిరిబిక్కిరి పనిచేస్తున్నాయి. ఇకపోతే స్పీకర్ ఇచ్చిన నోటీసులపై ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాజీమంత్రి దానం నాగేందర్ నివాసంలో భేటీ అయ్యారు. స్పీకర్ నోటీసులపై తర్జనభర్జన పడుతున్నారు.

దానం నాగేందర్ ఇంట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో నోటీసులపై ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎలాంటి సమాధానం ఇవ్వాలి అనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీమంత్రి దానం నాగేందర్ నివాసంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఎలాంటి సమాధానం ఇవ్వాలి అనేదానిపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి సైతం ఉన్నారు. అసెంబ్లీ సెక్రటరీ, సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఎలాంటి సమాధానం ఇవ్వాలి అనేదానిపై చర్చిస్తున్నారు.

ఢిల్లీ వెళ్లే యోచనలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసుల నేపథ్యంలో న్యాయపరంగా ముందుకు వెళ్లే అంశంపై ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. న్యాయస్థానాలను ఆశ్రయిస్తే మంచిది అనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ వెళ్లే యోచనలో సైతం ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించడం..అనంతరం న్యాయ నిపుణులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు పంపారు. ఫిరాయింపుల ఫిర్యాదుపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ సెక్రటరీ ఈ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే వివరణ ఇవ్వడానికి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు గడువు కోరినట్లు సమాచారం. వివరాలు..తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు.

తమ పార్టీ టిక్కెట్లపై ఎన్నికైన ఎమ్మెల్యేలు తెల్లంవెంకటరావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారని.. మూడు నెలలు గడిచినప్పటికీ శానసన స్పీకర్ ఎలాంటి చర్య తీసుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా ఈ విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభ స్పీకర్ ఆలస్యం మరింత మంది ఎమ్మెల్యే ఫిరాయింపులకు దారితీస్తుందని వారు వాదించారు. అయితే ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్.. నాలుగు వారాల్లోపు అనర్హత పిటిషన్లను విచారించడానికి షెడ్యూల్‌ను నిర్ణయించాలని శాసనసభ స్పీకర్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలను తెలంగాణ శాసనసభ ద్వారా స్పీకర్ హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు. ఈ క్రమంలోనే గతేడాది నవంబర్‌లో హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్ పక్కనబెట్టింది. స్పీకర్ సహేతుకమైన సమయంలో చర్య తీసుకోవాలని.. నిర్దిష్ట కాలక్రమాన్ని నిర్వచించకుండా వదిలివేసింది.

ఈనెల 10న సుప్రీంకోర్టులో విచారణ

అనర్హత పిటిషన్లను విచారించేటప్పుడు.. స్పీకర్ పెండింగ్ వ్యవధి, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఉద్దేశ్యం అసెంబ్లీ పదవీకాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. పిటిషన్లు దాఖలు చేసి ఇప్పటికే నాలుగున్నర నెలలు గడిచిపోయాయని.. నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డివిజన్ బెంచ్ పేర్కొంది. అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును పాడి కౌశిక్ రెడ్డి సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై సత్వర నిర్ణయం తీసుకునేలా జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణచేపట్టింది. ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను నిర్ణయించడానికి ''సహేతుకమైన వ్యవధి'' ఎంత అనే దానిపై తెలంగాణ శాసనసభ నుంచి స్పష్టత సుప్రీం కోర్టు ధర్మాసనం కోరింది.

తెలంగాణ శాసనసభ కార్యదర్శి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గిని.. ఈ విషయంలో కాలక్రమంపై స్పీకర్ నుంచి సూచనలు అందజేయాలని కోరింది. అనంతరం ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఏడుగురు ఎమ్మెల్యేలపై (పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్) దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ జాప్యం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కూడా కౌశిక్ రెడ్డి పిటిషన్‌కు జత చేస్తూ ఈ నెల 10న లిస్ట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

Similar News