వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి...

వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి...;

By :  Ck News Tv
Update: 2025-03-02 12:51 GMT

వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి...

మెరుగైన వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ బాలింత మృతి చెందింది.

వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందంటూ బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వెల్నెస్ ఆస్పత్రిలో శనివారం జరిగింది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కోహీర్ మండలం మదిరి గ్రామానికి చెందిన మహానందికి జహీరాబాద్లోని ఓ ఆస్పత్రిలో ఇటీవల ప్రసవం జరిగింది.

అయితే, ఆమెకు అధికంగా రక్తస్రావం కావడంతో శుక్రవారం సంగారెడ్డిలోని వెల్నెస్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెకు చికిత్స చేసిన వైద్యులు.. ఇక ఎలాంటి ఇబ్బందీ లేదని కుటుంబ సభ్యులకు తెలిపారు. కానీ, శనివారం ఉదయం మహానంది మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు.

దాంతో బంధువులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఆరోగ్యంగా ఉన్న మహిళ ఎలా చనిపోతుందని ప్రశ్నించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని ఆరోపించారు. ఆస్పత్రి వద్ద పూలతొట్టీలను ధ్వంసం చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వాగ్వాదం, తోపులాట జరిగింది. బాలింత మరణానికి కారణమైన వైద్యులపై, ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆస్పత్రిని సీజ్ చేయాలని, బాధిత కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆస్పత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంగారెడ్డి రూరల్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Similar News