గుంటూరులో బరి తెగించిన దోపిడీ దొంగలు

Guntur: గుంటూరులో బరి తెగించిన దోపిడీ దొంగలు.. ఇద్దరు వాచ్‌మెన్ల దారుణహత్య..
గుంటూరు: గుంటూరు నగరంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇద్దరు వాచ్‌మెన్లను హతమార్చిన దుండగులు.. పలు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు..
వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనలు నగర వాసులను ఉలిక్కిపడేలా చేశాయి. నిత్యం రద్దీగా ఉండే అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో వెంకటేశ్వర్లు అనే వాచ్‌మెన్ హత్యకు గురయ్యాడు. మరో వైపు అమరావతి రోడ్డులోని ఓ ద్విచక్రవాహన షోరూమ్ వద్ద కృపానిధి అనే వాచ్‌మెన్ సైతం ఇదే విధంగా హత్యకు గురయ్యాడు.
రెండు హత్యలకు సారూప్యత కనిపిస్తోంది. పొట్టకూటికోసం విధులు నిర్వహించే వాచ్‌మెన్లపై దుండగులు దాడి చేయడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అరండల్‌పేట ప్రాంతంతో పాటు పాత గుంటూరులోని కొన్ని దుకాణాల్లో ఇదే ముఠా చోరీకి పాల్పడింది. గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు..
పాతనేరస్థుల పనేనా?
హత్యలు, దోపిడీ ఘటనలు నగరంలోని పాతనేరస్థుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యం మత్తులో పాతనేరస్థులు దారుణాలకు తెగబడినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరో వైపు దోపిడీ దొంగలు బరితెగించి హత్యలకు తెగబడటంతో నగర వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలను సేకరించారు. అర్ధరాత్రి 2.30.. 3గంటల సమయంలో హత్యలు జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.