కలెక్టరేట్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కలెక్టరేట్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కలెక్టరేట్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కడప: కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్‌లో జాయింట్ కలెక్టర్ ఎదుటే ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. చాపాడు కు చెందిన విశ్వనాథ్ రెడ్డి తన భార్య అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకునేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజును కలిశాడు.
నాలుగైదు సార్లు కలిసిన ఆయన సరైన రీతిలో స్పందించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
సోమవారం కలెక్టరేట్ లోని గ్రీవెన్ సెల్ కార్యక్రమంలో పాల్గొని ఈ సమస్యను జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ దృష్టికి తీసుకు వచ్చారు.
తన భార్య అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స చేయించే విషయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిని కలిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించారని జె.సి.కి తెలిపారు.
తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతలో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు విశ్వనాథ్ రెడ్డి చేతిలోని పెట్రోల్ బాటిల్ ను తీసుకొని ఆత్మహత్యాయత్నాన్ని విరమింప చేశారు.
దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ తర్వాత విశ్వనాథ్ రెడ్డికి పోలీసులు, అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపి వేశారు.
విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. అక్టోబర్ 29న తన భార్యకు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించామన్నారు.
ఆ సమయంలో ఇలియారాణి ఆపరేషన్ చేసే సమయంలో పేగుకు రంధ్రం పడటం తో తీవ్ర అనారోగ్యానికి గురైంది. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందికాపాడుకున్నామన్నారు.
తన భార్యకు నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేసిన ఇలియారాణి పై చర్యలు తీసుకోవాలని గత మూడు నెలలుగా డి.ఎం.అండ్.హెచ్.ఓ నాగరాజుకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోలేదన్నారు.
దీంతో ఆర్థికంగా, మానసికంగా కుంగి పోయామన్నారు. వైద్యాధికారి డాక్టర్ ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యాదికారి, డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోక పోవడం వల్లే తాను ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డానన్నారు.
