అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్

అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్
అసెంబ్లీలో వైసీపీ ఆందోళన.. గందరగోళం అసెంబ్లీ పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతున్నారు. వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు సభను బాయ్కాట్ చేశారు.
అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు.
కాగా.. అసెంబ్లీలో వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. “అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గుర్తించండి. ప్రజల గొంతుక వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే” అంటూ నిరసనకు దిగారు. అనంతరం గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులపాటు సమావేశాలు నిర్వహించాలి, ఏ రోజు ఏ అంశంపై చర్చించాలనే ఎజెండాను ఖరారు చేస్తారు. మొత్తం రెండు లేదా మూడు వారాల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
ఈ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని పట్టుబట్టే అవకాశాలున్నాయి. . ప్రతిపక్షంలో ఉన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాసమస్యలపై గొంతువిప్పేది తాము మాత్రమే కాబట్టి.. ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా కోరుతూ ఇప్పటికే హైకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది.
మరోవైపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రాంగణంలో నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పాసులు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. మండలి ఛైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంకు మాత్రమే అసెంబ్లీ గేట్ 1 నుంచి అనుమతి ఉంటుంది. గేట్ 2 నుంచి మంత్రులకు మాత్రమే అనుమతి ఇస్తారు.
గేట్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతిస్తూ బులెటిన్ జారీ చేశారు. మండలి ఛైర్మన్, స్పీకర్, ముఖ్యమంత్రులు వచ్చి వెళ్లే కారిడార్‌లోకి ఇతరులెవరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు. మంత్రులు, సభ్యుల వ్యక్తిగత సహాయకులను అవసరం మేరకు మాత్రమే అనుమతిస్తామని.. ఇతరులకు అనుమతి లేదన్నారు. శాసనసభ పరిసరాల్లో సమావేశాలు, ప్రదర్శనలు, ధర్నాలు, బైఠాయింపులు పూర్తిగా నిషేధించారు. అయితే ఇదంతా జగన్ వస్తున్నందుకే అంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
