తెలంగాణ సచివాలయానికి బెదిరింపు కాల్స్..

తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి గుర్తుతెలియని దుండగుడు ఫోన్ చేసి బెదిరింపులకు దిగడం తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయంలో అర్జీలు, ఫిర్యాదుల విభాగానికి ఓ దుండగుడు ఫోన్ చేశాడు.

అనంతరం ఉద్యోగులు, సిబ్బందిపై బెదిరింపులకు దిగాడు. మూడ్రోజులుగా ఇదే విధంగా కాల్స్ చేస్తూ ఉద్యోగులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సీఎంవో కార్యాలయం ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతికత సహాయంతో నిందితుడి నంబర్ ట్రేస్ చేశారు. అనంతరం దుండగుడు ఉన్న ప్రాంతానికి వెళ్లి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఫోన్ చేయడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడే ఫోన్ చేశాడా? అతని వెనక మరెవరైనా ఉన్నారా?, ఫోన్ చేయడానికి గల కారణాలు ఏంటి? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, తెలంగాణ సచివాలయంలో భద్రతా వైఫల్యం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల నకిలీ ఐడీ కార్డుతో ఓ వ్యక్తి సచివాలయంలో హల్‌చల్ చేశాడు. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్ రావు ఫేక్ ఐడీ కార్డు సృష్టించుకున్నాడు. అనంతరం సచివాలయంలోకి అక్రమంగా ప్రవేశించి దందాలు మెుదలుపెట్టాడు. అతని కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో సెక్రటేరియట్ సీఎస్‌వో దేవిదాస్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ సిబ్బంది అతనిపై నిఘాపెట్టారు. భాస్కర్ రావును నకిలీ ఉద్యోగిగా గుర్తించిన ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి నకిలీ ఐడీ కార్డు తయారు చేసింది మైనార్టీ డిపార్ట్‌మెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రశాంత్ డ్రైవర్ రవిగా తేల్చారు. అనంతరం అతన్ని సైతం అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనలు సచివాలయ భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.

Admin

Admin

Next Story