
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్‌రావు…
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు పేరు ఖరారైంది. నామినేషన్ వేయాలని ఆయన్ను అధిష్ఠానంఆదేశించింది. ఈ మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర నాయకత్వానికి కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది.
రామచందర్‌రావు ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు, నాయకులు రామచందర్‌రావుకు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ అధిష్ఠానం ఈసారి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు పార్టీలో ఎక్కువకాలంగా సేవలందించిన నేతలకే అప్పగించాలనే విధానాన్ని అమలు చేస్తోంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో మాధవ్, తెలంగాణలో రామచందర్‌రావు లాంటి వర్గీ నాయకులను ఎంపిక చేసింది.
పార్టీ భవిష్యత్ దిశగా నూతన దారిని వేయాలన్న లక్ష్యంతో అనుభవం ఉన్న నేతలకే బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.రామచందర్‌రావు బీజేపీలో చాలా కాలంగా క్రియాశీలంగా ఉన్న నేత.
విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్, బీజేపీకి సంబంధించిన కార్యకలాపాల్లో భాగస్వామిగా ఉన్న ఆయన, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది కూడా. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవంతో పాటు, పార్టీలో వివిధ స్థాయిలలో నిర్వహణలో పాల్గొన్న ఆయనకు బలమైన మద్దతు ఉంది.