
ఒకే రోజు నాలుగు పరీక్షలా?…. రాసేదెలా?
రాసేందుకు వీలుగా తేదీలను మార్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెండి
బండి సంజయ్ కు నిరుద్యోగుల వినతి
‘‘సార్…. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం కష్టపడి చదువుకుంటున్నం. అప్పొసప్పో చేసి కోచింగ్ తీసుకుంటున్నం. 5 రూపాయల భోజనం తింటూ చదువుకుంటున్నం. కానీ ఈనెల 30న ఒకే రోజు నాలుగు పరీక్షలు (కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, అసిస్టెంట్ ఇంజనీరింగ్ (ఏఈ), జూనియర్ లైన్ మెన్ (జెఎల్ఎం) పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పరీక్షలన్నీ రాయడానికి మాకు తగిన విద్యార్హతలున్నాయి. కానీ ఒకేరోజు నిర్వహించడంవల్ల అన్నీ రాయలేని దుస్థితి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అధికారులు మాట వినడం లేదు. మీరైనా ఒత్తిడి మా భవిష్యత్తును కాపాడండి’’అంటూ పలువురు నిరుద్యోగులు ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలిసి మొరపెట్టుకున్నారు.
• ఈరోజు కరీంనగర్ లో పలువురు నిరుద్యోగ అభ్యర్ధులు బండి సంజయ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. కానిస్టేబుల్ ఫరీక్షల తేదీలను ఎప్పుడో ఖరారు చేసినందున… ఏఈ, జేఎల్ ఎం పరీక్షల తేదీలను వాయిదా వేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఎస్పీడీసీఎల్ కు ఈ మేరకు లేఖ రాయాలని విజ్ఝప్తి చేశారు.
• వారి ఆవేదనపట్ల సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ వెంటనే ప్రభుత్వానికి ఈ మేరకు లేఖ రాస్తానని, అర్హతలకు తగిన విధంగా అన్ని పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించేందుకు తనవంతు క్రుషి చేస్తానని హామీ ఇచ్చారు.