మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన టీచర్!

మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన టీచర్!
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు తాగి పాఠశాలకు వచ్చాడు. రావ డమే కాకుండా పిల్లలను చితక బాదాడు. ఇంటికి చేరిన అనంతరం తల్లిదండ్రులకు విషయం తెలుపడంతో ఈ విషయం బయటికి వచ్చింది.
విద్యార్థులు, తల్లిదండ్రుల కథనం ప్రకారం.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని గుండాయిపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రతి రోజూ పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం తర్వాత స్టడీ అవర్ నిర్వహిస్తున్నారు. గురువారం స్టడీ అవర్కు సోషల్ టీచర్ మాలోత్ శ్రీనివాస్ హాజరయ్యాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు మద్యం తాగి పాఠశాలకు వచ్చాడు. రావడమే కాదు, పిల్లలు చదవడం లేదని కోపంగా కర్రతో ఇష్టం వచ్చినట్టు కొట్టాడు.
స్టడీ అవర్ తర్వాత రాత్రి 9గంటల ప్రాంతంలో ఇండ్లకు చేరుకున్న పిల్లలు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో తల్లిదండ్రులు ఆగ్రహించారు. వెంటనే పాఠశాలకు చేరుకున్నారు.
సదరు ఉపాధ్యాయుడు వెళ్లి పోగా, కాసేపు ఆందోళన చేశారు. విద్యార్థులపై విచక్షణ రహితంగా కర్రతో కొట్టిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యం మద్యం తాగి వస్తున్నాడని, ఎవరికైనా చెబితే కొడ తానని బెదిరిస్తున్నాడని విద్యార్థులు రోదిస్తూ తెలిపారు.
ఈ విషయమై ఎంఈవో జీ హన్మంతును సంప్రదించగా, విద్యార్థుల తల్లి దండ్రులు తనకు ఫోన్ చేసి చెప్పారని, అప్పటికే హెచ్ఎం నానాజీతో మాట్లాడనని తెలిపారు. శుక్రవారం పాఠశాలకు వెళ్లి, విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడుతానని, విద్యార్థులపై చేయి చేసుకున్న ఉపాధ్యాయుడుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు.
