ఆగి ఉన్న లారీని కారు... ఒకరు మృతి..

ఆగి ఉన్న లారీని కారు... ఒకరు మృతి..
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు..
శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద షాపూర్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. కూతురు పెళ్లి చేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తండ్రి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శంషాబాద్ సీఐ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన పెద్ద రాజుల రామచంద్రయ్య, అతని కొడుకు భాస్కర్, బంధువులు పద్మ అలవేలుతో కలిసి తన(TG 08 N 8663) కారులో కూతురు వివాహం వనపర్తి జిల్లా గోపాలపేట గ్రామంలో ఉండడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం బయలుదేరి వెళ్లారు.
పెండ్లి అనంతరం తిరిగి ఆదివారం రాత్రి సమయంలో కూకట్పల్లి వస్తుండగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న (TS 22 T 8888) లారీని కారు బలంగా ఢీకొట్టడంతో కారు ముందు సీట్లో కూర్చున్న పెద్దరాజుల రామచంద్రయ్య (55) అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న అతని కొడుకు భాస్కర్ తో పాటు పద్మ అలవేలుకు తీవ్ర గాయాలు కావడంతో శంషాబాద్ ధోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారిపై వాహనాలు నిలపరాదని తెలిసి కూడా ఇలాంటి జాగ్రత్త పాటించకుండా నిలిపి ఉండడం వల్ల మా బాబాయ్ మరణించాడని కావున రోడ్డు పై లారీని నిలిపిన లారీ డ్రైవర్ పై తగిన చర్యలు తీసుకోవాలని మృతుడి అన్న కొడుకు పెద్ద రాజుల వినోద్ కుమార్ ఫిర్యాదు చేశాడు.
