మీరు పోలీసులా ..? రౌడీలా..?

మీరు పోలీసులా ..? రౌడీలా..?
HCU ఘటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్; హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (Hyderabad Central University) విద్యార్థుల ఆందోళనపై కేంద్రమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) స్పందించారు. విద్యార్థులపై చర్యలను ఖండించారు. స్టూడెంట్స్‌పై లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. సోమవారం మీడియాతో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. హెచ్‌సీయూ భూములకు సంబంధించి మీడియాలో వచ్చిన దృశ్యాలు చూసి తెలంగాణ సమాజంలో బాధపడని వ్యక్తి లేడన్నారు. విద్యార్థులను మానవత్వం లేకుండా లాక్కెళ్లడం దారుణమన్నారు. హెచ్‌సీయూలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారన్నారు. అమ్మాయిలను ఈడ్చుకెళ్తున్న వీడియోలు చూస్తే బాధేస్తోందన్నారు. భూములను ఎలా అమ్ముకుంటారని ప్రశ్నిస్తే ఇంతకు తెగిస్తారా అంటూ మండిపడ్డారు.
దొంగల్లా రాత్రి పూట జేసీబీలతో చదును చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అధికారంతో హెచ్‌సీయూకు వెళ్తున్నారని ప్రశ్నించారు. యూనివర్సిటీ భూములను అమ్మొద్దంటే విద్యార్థులను అడ్డుకుని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఆ వీడియోలను చూసి ప్రతీఒక్కరూ చలించిపోయారన్నారు. యూనివర్సిటీలోని 400 ఎకరాలు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా అంటూ వ్యాఖ్యలు
చేశారు. హెచ్‌సీయూ భూములకు అమ్మకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని విమర్శించారు. ఈనెల గడవాలంటే హెచ్‌సీయూ భూములను అమ్మాలనే ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. రాబోయే తరాలకు గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని భూములును అమ్మేస్తారని వ్యాఖ్యలు చేశారు.
